CM రేవంత్‌కు పాలనపై నో ఐడియా: కేసీఆర్
రేవంత్ రెడ్డికి పాలపై అవగాహన లేదని, అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డికి పాలపై అవగాహన లేదని, అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. మంగళవారం ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతలతో భేటీ అయ్యారు. వారితో కలిసి లంచ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని సూచించారు.
కొందరు అధికారకాంక్ష ఉన్నవారు ఉంటారు.. వారిని పట్టించుకోవద్దు.. స్థిమితంగా ఉండరు అని సూచించారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయని.. అయినా మనం భయపడలేదని గుర్తు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలు చాలా ఉంటాయని, వాటి పరిష్కారానికి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతుంటారని, వాటికి ఎదురొడ్డాలన్నారు. ప్రజలకు పని ఎందుకు చేయలేక పోతున్నామనేది కూడా ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు బాధ్యత ఇచ్చారు.. ప్రజల్లో ఉండాలన్నారు. అపాయింట్ చాలా మంది అడుగుతున్నారని, రోజుకు కొంతమందికి ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదన్నారు. ఆ పార్టీ నేతల మధ్యనే లొల్లి అవుతుంది, మరోవైపు చేరికల అంశంపైనా ఒకరికొకరికి అభిప్రాయబేధాలున్నాయన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై లీగల్‌గా ఫైట్ చేద్దామన్నారు. హైకోర్టుకు కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్దామని, అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకే చేరికలు జరిగాయన్నారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలో గెలిచినవారే స్వచ్ఛందంగా చేరారని పేర్కొన్నారు. తాము ఎప్పుడు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదని వెల్లడించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలపై పోరాడాలని నేతలకు సూచించారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తరచూ కలుస్తుంటాననిహామీ ఇచ్చారు. భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని, ఎవరు తొందరపడి పార్టీ మారి రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. అండగా తాను, పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులున్నారు.