మూడో లిస్ట్ కంటే ముందే.. హస్తం గూటికి ‘కారు’ నేతలు!
పార్లమెంట్ ఎన్నికల కోసం ఏక్షణమైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతున్నదన్న నేపథ్యంలో తెలంగాణలో చేరికల రాజకీయాలు రంజుగా మారాయి.
దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికల కోసం ఏక్షణమైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతున్నదన్న నేపథ్యంలో తెలంగాణలో చేరికల రాజకీయాలు రంజుగా మారాయి. ప్రధాన పార్టీలలోని అసంతృప్తు నేతలు, ఆశవాహులు పక్కపార్టీల్లోకి జంప్ చేస్తూ తమ బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలే బీఆర్ఎస్ ను వీటి కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరగా ఇక తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కారు పార్టీలో కాంగారెత్తిస్తోంది. దీంతో ఎంపీ ఎన్నికల నాటికి గులాబీ పార్టీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ ఆ పార్టీ క్యాడర్ లో జోరుగా జరుగుతోంది.
మొదటి దఫా చర్చలు పూర్తి :
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, బి.రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇంతలో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును నిరసిస్తూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక అదే బాటలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో మొదటి దఫా చర్చలు సైతం పూర్తయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీల మూడో జాబితా వెల్లడి కంటే ముందే వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మంత్రుల మంత్రాంగం:
వీరి చేరికల విషయంలో పలువురు మంత్రులు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు ఛాలెంజ్ చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ పైళ్లకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు తన సిట్టింగ్ స్థానమైన భువనగిరి ఎంపీ టికెట్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పించి గెలిపించడం ద్వారా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పైచేయి సాధించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు జగదీశ్ రెడ్డికి మధ్య వార్ తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఇక నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ లో కలకంగా భావిస్తున్న మర్రిజనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ లోకి ఆహ్వానిచి మల్కాజ్ గిరి లేదా సికింద్రబాద్ టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఉత్తర తెలంగాణలో చేరికలపై మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక వీరితో పాటు బీజేపీలో చేవెళ్ల, మల్కాజిగిరి టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సైతం కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే పార్టీ మార్పుపై నేతలు కానీ, చేరికలపై గాంధీ భవన్ వర్గాలు కానీ సైలెంట్ గా ఉన్నాయి.