TRS నేతలకు ఫారిన్ టూర్ల పరేషాన్.. కాలు బయటపెట్టగానే ఎటాక్!
తెలంగాణలోని అధికార పార్టీ నేతలపై వరుసగా ఐటీ, ఈడీ దాడులు సంచలనంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే సందేహాలు వ్యక్తం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార పార్టీ నేతలపై వరుసగా ఐటీ, ఈడీ దాడులు సంచలనంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్న లోపే చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, గ్రానైట్ ఎగుమతుల అంశంలో సోదాలు, తాజాగా మంత్రి మల్లారెడ్డి సన్నిహితులపై ఈడీ రెయిడ్స్ ఇలా అన్ని కలగలిపి టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న రెయిడ్స్ వెనుక ఓ ఆసక్తికర అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. అధికార పార్టీ నేతలకు విదేశీ టూర్లు కలిసి రావడం లేదా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తోంది. గులాబీ నేతలపై జరుగుతున్న తనిఖీలు నేతలు ఫారిన్ లో ఉన్న సమయంలోనో లేక ఫారిన్ టూర్ లో జరిగిన వ్యవహరాల చుట్టూ కొనసాగడం చర్చకు దారితీస్తోంది.
మొన్న గంగుల నేడు మర్రి:
నవంబర్ రెండో వారంలో తెలంగాణలోని గ్రానైట్ సంస్థలపై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన కంపెనీతో పాటు ఆయన నివాసంలో తనిఖీలు జరిగాయి. అయితే దాడులకు ముందురోజే ఆయన దుబాయ్ పర్యటనకు వెళ్లడం గమనార్హం. కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు బద్దలు కొట్టించి మరీ ఇంట్లోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. సోదాల విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్ హుటాహుటీన తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిగాయి. మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కుమార్తె శ్రేయారెడ్డిని వెంట తీసుకువెళ్లిన ఐటీ అధికారులు బ్యాంక్ లాకర్లను తెరిచి చూశారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో మర్రి రాజశేఖర్ కూడా విదేశాల్లోనే ఉన్నారు. విహారయాత్ర నిమిత్తం టర్కీకి వెళ్లిన ఆయన తనిఖీల విషయం తెలుసుకుని గురువారం తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు.
క్యాసినో కేసులో విదేశీ కోణం:
మరో వైపు సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, మంత్రి పీఏతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ముందుకు హాజరు కాగా మెదక్ డీసీసీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ నుంచి నోటీసులు అందినా ఆయన ఇంకా విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ కేసులో కూడా విదేశాలతోనే ముడి పడి ఉంది. నేపాల్ లో క్యాసినో నిర్వహించి అక్కడి నుంచి హవాలా మార్గంలో హైదరాబాద్ కు భారీ స్థాయిలో నగదు చేరిందనే సమాచారంతో ఈడీ తీగలాగుతోంది. వీరితో పాటు మంత్రి కేటీఆర్ విదేశాల టూర్లపై చాలా కాలంగా రాజకీయ విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఫారెన్ టూర్లు TRS నేతలకు కలిసిరావడం లేదా అనే చర్చ మొదలైంది.