మంచి జరిగితే మీ ఖాతాలో.. పనులు ఆగితే కేంద్రంపై నిందలా?
రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే బీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవడం, ఎక్కడైనా పనులు ఆగిపోతే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే బీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవడం, ఎక్కడైనా పనులు ఆగిపోతే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విడతలుగా నిధులను కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా, కాంట్రాక్టర్ల ఆలస్యంతో పనులు సకాలంలో జరగడం లేదన్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆగిపోయిన ఫ్లైఓవర్ పనులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎన్వీ సుభాష్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాట్లు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుండి దారి మళ్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రలకు తెరలేపుతుందన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు.