75 ఇయర్స్ లోక్ సభ ఎలక్షన్ హిస్టరీ లో ఫస్ట్ టైమ్.. రోజుకు రూ.100 కోట్ల నగదు స్వాధీనం
18వ లోక్ సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ధన ప్రవాహం కొనసాగుతుందని ఈసీ తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో:18వ లోక్ సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ధన ప్రవాహం కొనసాగుతుందని ఈసీ తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు ఎన్నికల్లో నగదు ప్రవాహంపై దృష్టిపెట్టారు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన ఈసీ.. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ ఉందని తెలిపింది. ఈసారి దేశ వ్యాప్తంగా సగటున రోజూ రూ.100 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈసీ పేర్కొంది. ఇప్పటికే గత ఎన్నికల రికార్డును అధిగమించినట్లు ప్రకటించిన ఈసీ.. తాజా గణాంకాల ప్రకారం 75 ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తాయిలాలు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది..
వాటి వాటే ఎక్కువ:
ఈసీ రికవరీ చేస్తున్న నగదు, మద్యం, మాదక ద్రవ్యాలలో సింహభాగం 45 శాతం వాటా డ్రగ్స్ కే ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు రూ.395.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా మద్యం రూపంలో రూ.489.31 కోట్ల విలువ చేసే 35.82 కోట్ల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు రికవరీ చేయగా రూ.2068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. టీవీలు, ఫ్రిడ్జిలు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
టాప్ లో రాజస్థాన్, గుజరాత్ టాప్:
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో నగదు రూ.49,1818260 నగదు, రూ.19.2125880 విలువ గల 68,5838.52 లీటర్ల మద్యం, రూ.22,7139650 విలువైన డ్రగ్స్, రూ.30,741334 బంగారం, ఇతర విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.