గురుకులాల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి.. సీఎం ఇంటి వద్ద మోకాళ్ల పై కూర్చోని కొంగుచాచి అభ్యర్థన
గురుకులాల్లో బ్యాక్‌లాగ్ పేరుతో పోస్టులు ఖాళీ పెట్టకుండా నోటిఫికేషన్ లో ఇచ్చిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గురుకులాల్లో బ్యాక్‌లాగ్ పేరుతో పోస్టులు ఖాళీ పెట్టకుండా నోటిఫికేషన్ లో ఇచ్చిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట పలువురు గురుకుల అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటంతో ఇంటి వద్ద ఆయన ఫ్లెక్సీకి గురుకుల అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళా అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని కొంగుచాచి ఉద్యోగాలు బ్యాక్‌లాగ్ లో పెట్టొద్దని అర్థించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. గురుకులాల్లో 9,210 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని, వాటిలో 2 వేల ఉద్యోగాలకు పైగా బ్యాక్‌లాగ్ పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలను బ్యాక్‌లాగ్ పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్‌లో విద్యాబోధనపై ప్రభావం చూపుతుందన్నారు. అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తే తమకూ న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.