Medico Preethi డాక్టర్లు హోప్ లేదన్నారు: ప్రీతి తండ్రి నరేందర్
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఇక ఎటువంటి ఆశలు లేవని వైద్యులు తనతో చెప్పినట్లు ఆమె తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఇక ఎటువంటి ఆశలు లేవని వైద్యులు తనతో చెప్పినట్లు ఆమె తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు. తన కూతురికి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నా అనుమానంగానే ఉందని అన్నారు. అంతేకాకుండా, ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులకు డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఎటువంటి ఆశలు లేవని, ప్రీతికి ఐదురోజులుగా వైద్యం అందిస్తున్నా.. నిన్నటి వరకు విషమంగా ఉన్న ఆరోగ్య పరిస్థితి ఇవాళ అత్యంత విషమంగా ఉందన్నారని ఆమె తండ్రి నరేందర్ అన్నారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారన్నారు.
ఇక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని, తనది ముమ్మాటికి హత్యాయత్నమేనని మరోసారి తండ్రి నరేందర్ వ్యాఖ్యానించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూని హెచ్ఓడీ సరిగా హ్యాండిల్ చేయలేదన్నారు. ప్రీతి బతికేందుకు కేవలం ఒకశాతం మాత్రమే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాగా, మరికాసేపట్లో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు తాజా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారు. ఈ హెల్త్ బులిటెన్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి సమాచారంలో అత్యంత కీలకం కానుంది. మరోవైపు నిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలన్న నిమ్స్ డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు పంజాగుట్ట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.