ప్యాకేజీ 21, 22 నిర్మించవద్దని మళ్లీ రైతుల నిరసనలు
కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 పనులను నిలిపివేయాలని కోరుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులు క్యాంపు కార్యాలయం ముట్టడించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 పనులను నిలిపివేయాలని కోరుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులు క్యాంపు కార్యాలయం ముట్టడించారు. శుక్రవారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో కొండం చెరువు వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని రైతులు క్యాంపు కార్యాలయం ముట్టడించారు. గురువారం 9 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు క్యాంప్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిప్ప గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కొండం చెరువు రిజర్వాయర్ పనులను నిలిపి వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. రైతుల నిరసనకు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి ప్యాకేజ్ 21, 22 లో భాగంగా కొండం చెరువు రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీ నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 పేరుతో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రీ డిజైన్ పనులు చేపట్టడాన్ని ముంపు గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
డీపీఆర్ లేకుండా భూసేకరణ జరగకుండానే ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం సరికాదన్నారు. దీంతో తొమ్మిది గ్రామాలు, 3 తండాలు, 1200 ఎకరాల వ్యవసాయ భూమి, 800 ఎకరాల అటవీ భూమి, 12 వేల కుటుంబాలు 14 వేల జనాభా నిరాశ్రయులం అవుతామని తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రీ డిజైన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రజల వ్యతిరేకతతో గతంలో ప్రాజెక్ట్ పనులను నిలిపివేసిన అధికారులు. ఇటీవల తిరిగి ప్రారంభించే దిశగా పనులు చేస్తుండడం రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోని రైతులు, ప్రజలు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.