వారం రోజులే.. రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ, సహకార బ్యాంకుల

Update: 2022-03-26 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ, సహకార బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.50 వేల లోపు ఉన్నట్లయితే ఈ నెలాఖరుకు మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక ఏడాదికి ఇంకా వారం రోజులే మిగిలి ఉన్నందున ఎప్పుడెప్పుడు బ్యాంకు ఖాతాల్లో పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నప్పటికీ కొద్ది మందికి మాత్రమే క్రెడిట్ చేసింది. అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ఇవ్వలేదు. దీంతోనే తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హరీశ్‌రావు దీన్ని నొక్కిచెప్పారు. హామీ ఇచ్చి రెండు వారాలు దాటినా ఇంకా జమ కాలేదనే చర్చ రైతుల్లో మొదలైంది.

రెండో టర్ములో తొలి విడతలో రూ. 25 వేల వరకు పంట రుణాలు ఉన్న సుమారు 5.12 లక్షల మంది రైతులకు గతేడాది ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేయనున్నట్లు గతేడాది బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ శ్లాబ్‌లో మొత్తం 5.72 లక్షల మంది రైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు అవసరమవుతుందని లెక్కలు వేసుకున్నది. కానీ కేవలం 2.70 లక్షల మంది రైతులకు మాత్రమే రూ. 690 కోట్లతో సరిపెట్టిన ప్రభుత్వం ఇంకా 3.02 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,100 కోట్లను విడుదల చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తప్పకుండా జమ చేస్తుందనే నమ్మకం మాత్రం రైతుల్లో వ్యక్తమవుతున్నది.

ఈ నెల చివరిలోగా ఎలాగూ జమ చేయనునన్నట్లు స్వయంగా మంత్రి హామీ ఇచ్చినా ఆర్థిక శాఖ ఇంకా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేయలేదు. గతేడాది బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రూ. 50 వేల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ చేయనున్నట్లు హరీశ్‌‌రావు స్పష్టం చేశారు. అర్హత కలిగిన రైతులు 5.72 లక్షల మంది ఉన్నట్లు గుర్తించినా అందులో రూ. 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ చేసింది. ఆ ప్రకారం రూ. 690 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఇంకా 3.02 లక్షల మంది రైతులకు రూ. 1,100 కోట్లు అవసరమున్నది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యానే ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయలేకపోయిందనే విమర్శలను మూటగట్టుకున్నది. మూడో విడతలో రూ. 75 వేల వరకు రుణాలు ఉన్న 21 లక్షల మంది రైతులకు సుమారు రూ. 13 వేల కోట్లను అందించాల్సి ఉన్నది. థర్డ్ ఫేజ్ రుణ మాఫీని అమలుచేయడానికి ముందు సెకండ్ ఫేజ్‌లో పెండింగ్‌లో ఉన్న రైతులకు (రూ. 50 వేల లోపు రుణం) పూర్తిస్థాయిలో మాఫీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియనున్నది. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. దీంతో ప్రభుత్వం అనివార్యంగా రూ. 1,100 కోట్లను వారం రోజుల్లో విడుదల చేయడం ద్వారా సెకండ్ ఫేజ్ ప్రక్రియ ముగుస్తుంది. వ్యవసాయ శాఖ దగ్గర లబ్ధిదారుల డాటా మొత్తం ఉన్నందున ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసి నిధులను అందించడంతోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ కానున్నది. ఒకవైపు యాసంగి ధాన్యాన్ని అమ్ముకోవడంలో రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రుణమాఫీ కింద జమ చేసే డబ్బులు వారికి ఉపశమనంగా నిలవనున్నది.

Tags:    

Similar News