విత్తనాల కోసం రైతుల పడిగాపులు.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Update: 2024-05-30 09:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో:నకిలీవిత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని, జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా వాటిని రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. కలెక్టర్లు, అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేపట్టాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట రైతులకు ఇబ్బందులు లేకుండా కౌంటర్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం సీడ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు.

కాగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కోసం పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరుతూ పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. విత్తనాల కొనడానికి ఐదు రోజులుగా వస్తున్న ప్రతి రోజు కేవలం రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇతర జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల విషయంలో తాజాగా సమీక్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News