పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడంపై రైతులు సీరియస్
పరిహారం చెల్లించకుండానే జాతీయరహదారి పనులు చేపట్టడంపై కరీంనగర్ జిల్లా ఇరుకుల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
దిశ, కరీంనగర్ రూరల్ : పరిహారం చెల్లించకుండానే జాతీయరహదారి పనులు చేపట్టడంపై కరీంనగర్ జిల్లా ఇరుకుల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పనులు చేస్తున్న టిప్పర్‌లకు అడ్డంగా నిల్చొని పనులు నిలిపివేసారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన తమ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ ఇరుకుల్లకు చెందిన పలువురు రైతులు వరంగల్, జగిత్యాల నేషనల్ హైవే పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు రావల్సిన నష్టపరిహారం చెల్లించకుండానే కాంట్రాక్టర్ పనులు చేపడుతున్నారని ఆరోపించారు.
జాతీయ రహదారులను నిర్మించేందుకు భూ సేకరణ జరిపిన అధికారులు పరిహారం బాధిత కుటుంబాలకు మాత్రం ఇవ్వలేదని వాపోయారు. తమ భూములకు సంబందించిన పరిహారం వెంటనే తమకు అందజేయాలని డిమాండ్ చేసిన రైతులు తరువాతే నిర్మాణం చేపట్టాలని అంటున్నారు. అయితే స్థానికంగా ఉన్న యంత్రాంగం మాత్రం రెండు మూడు రోజుల్లో డబ్బులు అకౌంట్లలో పడుతాయని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. తమకు పరిహారం సకాలంలో అందించనట్టయితే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు