మెడికల్ షాపులు, హాస్పిటల్సే టార్గెట్..?
రాష్ట్రంలో మరో కొత్త దందా తెర మీదకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, ప్రైవేట్ హాస్పిటళ్లపై రెయిడ్స్ పేరిట కొన్ని ఫార్మసీ అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో కొత్త దందా తెర మీదకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, ప్రైవేట్ హాస్పిటళ్లపై రెయిడ్స్ పేరిట కొన్ని ఫార్మసీ అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా కొన్ని మెడికల్ షాపులు, ఆసుపత్రులకు వచ్చి తనిఖీలు చేయాలని, రికార్డులు చూడాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఫార్మసీ యజమానులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా వినియోగదారుల ఫోరమ్స్ అంటూ బోగస్ మాటలు చేస్తూ దమ్కి ఇస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఫార్మసీ యజమాని పేర్కొన్నారు. చిన్న మిస్టేక్స్ ను పెద్దవిగా చూపి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫార్మసీ యజమానులు వివరిస్తున్నారు. దీంతో పాటు మరి కొందరు తమ మెడిసిన్ విక్రయించాలని సంఘాలు పేరిట ఆసుపత్రులు, మెడికల్ షాపులకు సూచిస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మసి యజమాని వెల్లడించారు.
ఆయా వ్యక్తుల మాట వినని షాపులపై ఏదో తప్పిదాన్ని చిత్రీకరించి డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నారని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఫార్మసీ ఓనర్ తెలిపారు. ఎలాంటి సంబంధం లేని సంఘాలు, అసోసియేషన్లు ప్రైవేట్ మెడికల్ షాపులు, హాస్పిటల్స్ మీద రెయిడ్స్ చేయడం ఏమిటని? ఫార్మసీ యాజమానులు సంఘం పేర్కొంటున్నది. పైగా వాళ్లు ఫిర్యాదు చేస్తే కొందరు డ్రగ్ ఇన్ స్పెక్టర్లు రంగంలోకి దిగడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తమకు అనుమానం ఉందని ప్రభుత్వ జోక్యం చేసుకుని ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉన్నదని ఫార్మసీ ఓనర్స్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. త్వరలోనే సీఎం, హెల్త్ మినిస్టర్ కు ఫిర్యాదు చేయాలని మెడికల్ షాప్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగిన సమాచారం, వివరాలను ఓ నివేదిక రూపంలో తయారు చేస్తున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రులపై డీఎమ్ హెచ్ వోలు మానిటరింగ్ ఉంటుంది. కానీ తాజాగా కొన్ని సంఘాలు పేరిట రెయిడ్స్ నిర్వహించడం తాను ఎన్నడూ చూడలేదని వరంగల్ టౌన్ కు చెందిన ఓ మెడికల్ షాపు ఓనర్ తెలిపారు. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెంటనే చొరవ తీసుకొని ఇలాంటి దోపిడీలపై అరికట్టాల్సిన అవసరం ఉన్నదని ఫార్మసీ ఓనర్స్ కోరుతున్నారు. దీంతో పాటు మెడికల్ షాపులు, ఆసుపత్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని వివరిస్తున్నారు. తమపై నకిలీ రెయిడ్స్ కు వచ్చే వాళ్లను ఏసీబీ తరహాలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు డ్రగ్ విభాగంలో ఓ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఓ మెడికల్ షాప్ ఓనర్ పేర్కొన్నారు.