Fake Calls : ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ కాల్స్.. ఏసీబీ కీలక సూచన

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. లంచం తీసుకున్న అధికారులను రెడ్ వ్యాండెడ్‌గా పట్టిస్తూనే ఉంది.

Update: 2024-08-27 14:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. లంచం తీసుకున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో అవినీతి ఆఫీసర్ల గుండెల్లో గుబులు పుడుతోంది. ఇదే అదునుగా భావించిన కొంత మంది అగంతకులు ఏసీబీ అధికారులమంటూ తమ మీద కేసులు కాకుండా చూస్తామని ప్రభుత్వ ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వం ఉద్యోగులకు డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.

ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బు చెల్లించినట్లు తెలిసిందని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ కాల్స్‌ను ఎవరూ నమ్మొదని సూచించింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఏసీబీ యూనిట్ లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఎవరికి కాల్ చేయరని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు ఎవరైనా ఇలాంటి కాల్స్ చేసి బెదిరిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని పిలుపు నిచ్చింది.


Similar News