ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఊసరవెల్లి: ఈటల రాజేందర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఊసరవెల్లి అని, ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్నారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-04-04 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఊసరవెల్లి అని, ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్నారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని తాడ్‌బండ్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ కాలనీకి పోయినా, ఏ వాడకు పోయినా, అభివృద్ధి పనులు జరిగింది. కేంద్ర ప్రభుత్వమేనని చెబుతున్నారని, రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి పనులూ జరగలేదని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు డబ్బు మీద తప్పితే ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని ఫైరయ్యారు.

కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని ఈటల ఎద్దేవా చేశారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో మారిపోయి, పదవులు పొందడం నీచమైన పని అని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, అలా మారినవారిని పిచ్చికుక్కలని కొట్టినట్టు కొట్టమన్నారని, కానీ పార్టీ మారిన దానం నాగేందర్‌కు ఎలా టిక్కెట్ ఇచ్చారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈటల ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు చచ్చే వయసులో ఇదేం పని అన్నారని, మరి కేకేపై మీరు చేసిందేంటని రాజేందర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఈటల మండిపడ్డారు.

Tags:    

Similar News