కంచెల పాలన లేదని చెప్పి ఓయూలో అలా చేస్తారా.. ఎర్రోళ్ల శ్రీనివాస్

కంచెల పాలన లేదని ఓయూలో కంచెలు వేయడం ఏంటని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

Update: 2024-07-12 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంచెల పాలన లేదని ఓయూలో కంచెలు వేయడం ఏంటని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నిరుద్యోగులు, విద్యార్థులపై సీఎం, మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది, మెగా డీఎస్సీ ఏమైందని వారు అడుగుతున్నారని తెలిపారు. సీఎం, మంత్రులు వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. కాంగ్రెస్‌లాగా బీఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయదని తెలిపారు. నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కాంగ్రెస్ నేతలు డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ హయాంలో 117 నోటిఫికేషన్లు వేసి లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఆర్టీసీ ఉద్యోగాల విషయంలో మంత్రి, ఎండీ మాటలకు పొంతన లేదన్నారు. పోలీసులు నిరుద్యోగులు, జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. 


Similar News