Minister Sitakka : అన్ని శాఖల ఉద్యోగులు ఒకే కుటుంబంలా కలిసి పని చేయాలి
జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తూ ములుగు చిన్న జిల్లాను చింత లేని జిల్లాగా తీర్చిదిద్దాలని
దిశ, ములుగు ప్రతినిధి: జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తూ ములుగు చిన్న జిల్లాను చింత లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి మంత్రి ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల ప్రజలతో చర్చించిన అనంతరం అంచనాలను తయారుచేసి నివేదికలు సమర్పించాలని అన్నారు. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులను చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు తెలుసుకుంటారని అన్నారు.
ఎన్.ఆర్.జి.ఎస్ పథకం కింద పంట పొలాలకు వెళ్లే దారిలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం తో పాటు చెక్ డ్యాముల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు వాటికి ఉపయోగించుకోవాలని, గ్రామాలలో ఈ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు చేపట్టవలసిన పనులపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరకు మేడారం గ్రామంలో భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి శాఖ అధికారి తన కింది స్థాయి సిబ్బందితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై
దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని వెల్లడించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఎ పి. ఓ. చిత్ర మిశ్రా లతో కలసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 52 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ. లక్ష 116 చొప్పున మొత్తం రూ.52 లక్షల పైచిలుకు విలువ కలిగిన చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు.ఈ సమావేశం లో ఆర్డీఓ కే సత్య పాల్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ విజయ భాస్కర్, నేషనల్ హై వే, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్ డబ్లు ఎస్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీ డి ఓ లు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.