షోకాజ్ నోటీసుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీరియస్
ఏఐసీసీ నేతకు పీసీసీ షోకాజ్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ నేతకు పీసీసీ షోకాజ్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నాపై షోకాజ్ ఇచ్చే అధికారం మీకెక్కడిదన్నారు. నేను పార్టీ వీడాలంటే నిమిషం పట్టదని, కానీ ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదన్నారు. కేసీఆర్ ఆఫర్ ఇచ్చిన తిరస్కరించానన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన బాధపడలేదన్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో, టీవీలో వార్తలు వస్తే నాపై షోకాజ్ ఇస్తారా? అని ప్రశ్నించారు. నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి నేను పార్టీ నుండి వెళ్లిపోతా అన్నారు.
పార్టీలు మారే వారు నాపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. మచ్చ లేని మనిషిని, ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశానన్నారు. నా మీద కోపం ఉంటే చెప్పండి కానీ ఇలా అవమానిస్తారా అని ప్రశ్నించారు. నా మీద పగ పట్టిండ్రు.. నన్ను పార్టీ నుండి పంపించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పార్టీ మీద పట్టు కోసం పార్టీని కబ్జా చేస్తా అంటే మీ ఇష్టం అన్నారు. నిన్ననే రేవంత్ రెడ్డితో మాట్లాడానని, కాంగ్రెస్‌లో గ్రూపులు సహజం అన్నారు. బీజేపీ నాయకుల్ని నేరుగా కలిసిన వారికి ఎలాంటి నోటీసులు ఉండవు కానీ నేను ఏం చేశానని నాకు షోకాజ్ నోటీసుల ఇచ్చారని ఫైర్ అయ్యారు.