ఎన్నికలే టార్గెట్.. కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్!

ఎమ్మెల్యే ఈటల టార్గెట్‌గా బీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది.

Update: 2023-04-19 06:16 GMT

దిశ, హుజూరాబాద్: ఎమ్మెల్యే ఈటల టార్గెట్‌గా బీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఉప ఎన్నికల్లో షాక్ తిన్న బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడానికి ముందస్తు వ్యూహం రూపొందిస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గ బీఆర్ఎస్‌లో అన్ని తానై వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డినే అధిష్టానం ఆ పార్టీ హుజూరా'బాద్' షా గా బుధవారం నియమించింది.

ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైనా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఉద్యమకారునితోనే దెబ్బతీయాలనే టార్గెట్‌తో ఇదే నియోజకవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను బరిలో దింపింది. ఈటల ఓటమి కోసం సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించినప్పటికీ నియోజకవర్గంలో ఓటర్ల నుంచి చేదు ఫలితమే చవి చూడాల్సి వచ్చింది. అప్పటి నుండే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తుంది.

ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్‌కే నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలన్నీ కౌశిక్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజల్లో ఉంటే ఈ నియోజకవర్గంలో గులాబీ రెపరెపలాడటం ఖాయమని, ఇక నుండి ప్రజలతో మమేకం కావాలని కౌశిక్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. పరోక్షంగా జరగబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ సెగ్మెంట్ నుంచి కౌశిక్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంకేతాలిచ్చారు.

ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించిన అధిష్టానం కౌశిక్ రెడ్డికి తాజా మరింత ప్రాధాన్యత పెంచారు. మరో వైపు నియోజకవర్గంలో అసమ్మతికి తావివ్వకుండా ఉండేందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టూరిజం ఛైర్మెన్‌గా నామినేట్ పదవిలో నియమించి సంతృప్తి పరిచారు. పార్టీలో రెండవ అధికార కేంద్రం ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే ముందస్తు వ్యూహంలో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జిగా కౌశిక్ రెడ్డి ని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. 

Tags:    

Similar News