17 రోజులు.. 41 బహిరంగ సభలు.. ఎన్నికల కదన రంగంలోకి సీఎం కేసీఆర్

సుమారు మూడు వారాల పాటు అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 15 నుంచి పార్టీ యాక్టివిటీస్‌లో ముమ్మరంగా

Update: 2023-10-11 03:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సుమారు మూడు వారాల పాటు అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 15 నుంచి పార్టీ యాక్టివిటీస్‌లో ముమ్మరంగా పాల్గొననున్నారు. ఫస్ట్ డే తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీతో పాటు వారికి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. సెంటిమెంట్‌గా కలిసొచ్చే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని మొదలు పెట్టనున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి అక్కడి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

తొలి నాలుగు రోజుల టూర్ తర్వాత కేసీఆర్ వారం రోజుల పాటు (19 నుంచి 25 వరకు) విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కంటిన్యూగా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నవంబర్ 4వ తేదీ మాత్రం విరామం ఇచ్చేలా పార్టీ రోడ్ మ్యాప్‌ను, షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ రౌండ్‌లో చివరి రోజున (నవంబర్ 9న) మధ్యాహ్నం రెండు గంటలకల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అది పూర్తి కాగానే కామారెడ్డి సెగ్మెంట్‌లో నామినేషన్ వేయనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించి ఫస్ట్ రౌండ్ ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తారు.

తొలి నాలుగు రోజుల పాటు రెండు చొప్పున నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైనా ఈ నెల 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు మాత్రం ప్రతి రోజూ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పబ్లిక్ మీటింగ్‌లలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. చివరి రోజున నామినేషన్ వేయడానికి ముందు తనకు సెంటిమెంట్‌గా ఉండే సిద్దిపేట సెగ్మెంట్‌లోని కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచనున్నారు. తర్వాత వాటిని తీసుకుని నేరుగా రిటర్నింగ్ ఆఫీస్‌కే వెళ్లి దాఖలు చేస్తారు. తదుపరి రౌండ్‌లో మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేసేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.

పార్టీ రూపొందించిన కేసీఆర్ టూర్ షెడ్యూలు ఇదీ :

అక్టోబర్‌ 15 : హుస్నాబాద్‌

అక్టోబర్‌ 16 : జనగాం, భువనగిరి

అక్టోబర్‌ 17 : సిరిసిల్ల, సిద్దిపేట్

అక్టోబర్‌ 18 : జడ్చర్ల, మేడ్చల్‌

అక్టోబర్ 19-25 : విశ్రాంతి

అక్టోబర్‌ 26 : అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు

అక్టోబర్‌ 27 : పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్

అక్టోబర్‌ 29 : కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్‌ 30 : జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌

అక్టోబర్‌ 31 : హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 1 : సత్తుపల్లి, ఇల్లెందు

నవంబర్‌ 2 : నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌ 3 : భైంసా (ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల

నవంబర్ 4 : విశ్రాంతి

నవంబర్‌ 5 : కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్‌ 6 : గద్వాల, మఖ్తల్‌, నారాయణపేట

నవంబర్‌ 7 : చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్‌ 8 : సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

నవంబర్ 9 : గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ల దాఖలు. కామారెడ్డిలో బహిరంగసభ

Tags:    

Similar News