అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ..!

Update: 2024-10-23 07:34 GMT

దిశ, సిటీక్రైం: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి ధరణిని అడ్డం పెట్టుకుని సంపాదించిన అక్రమ రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ అక్షరాలా రూ.100 కోట్లని తెలుస్తోంది. 2014 నుంచి 2024 అగస్టు 14వ తేది వరకు సంపాదించిందని ఏసీబీ అధికారుల సోదాల్లో స్పష్టమైంది. దీంతో అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి మీద ఆదాయానికి మించి కలిగిన ఆస్తులు కలిగి ఉన్నందున కేసు నమోదు చేసి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు 41-ఏ కింద నోటీసును ఇచ్చారు.

అగస్టు నెలలో ధరణిలో ప్రొహిబిటెడ్ ఆప్షన్ నుంచి 14 గుంటల స్థలాన్ని తగ్గించేందుకు రూ.8 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినప్పటి నుంచి అదనపు కలెక్టర్ మీద అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఫిర్యాదులపై పూర్తిగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. తాజాగా ఆయన అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.4.19 కోట్ల విలువ చేసే ఆస్తులు ఆయన వద్ద ఆదాయానికి మించి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈయన బ్యాంకులో రూ.2 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు ఏసీబీ దర్యాప్లులో ఆధారాలు లభించాయి. రెండు చోట్ల కోట్ల విలువ చేసే స్థలాలను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు డెవలప్‌మెంట్‌ కోసం ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉంటే 2014 నుంచి 2024 అగస్టు వరకు అంటే గత 10 ఏండ్లలో అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు? ఏ విధంగా ఇంత అక్రమార్జన చేశారు..? అనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కీలక మంత్రి దగ్గర భూపాల్‌రెడ్డి ఓఎస్‌డీగా విధులు నిర్వహించిన విషయం కూడా అధికారులు గుర్తించారు.

రంగంలోకి ఈడీ:

అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిబోతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఈడీ అధికారులు అదనపు కలెక్టర్ అవినీతి, అక్రమాస్తుల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఏసీబీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఈ కేసులో భూపాల్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారిని, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారిని కూడా ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 


Similar News