5 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో 5 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో 5 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదు ఈడీ బృందాలు ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నది. విచారణను మహిళా అధికారి సమక్షంలో అధికారులు వీడియో షూట్ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతుంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు.
తొలుత కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అరుణ్ పిళ్లై రిపోర్ట్, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత మళ్లీ విచారణను మొదలుపెట్టారు. మహిళ కాబట్టి సాయంత్రం 6 గంటల వరకే విచారించాలి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించే అవకాశం ఉన్నది. తిరిగి రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు సూచించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, మంత్రి కేటీఆర్ రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు.
ఢిల్లీ పరిణామాలపై కేసీఆర్ ఆరా...
కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు. మరోవైపు, విచారణ అనంతరం కవిత అరెస్టైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోను ఆందోళనలు చేపట్టేందుకు ఆప్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు అంశం ఉత్కంఠంగా మారింది.
Also Read..
Pawan Kalyan: అలా ఎందుకు చేశారు.. బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు