Eatala Rajender: ఇంకాస్త సర్దుకుని ఉండి ఉంటే బీజేపీకి మరో నాలుగు సీట్లు వచ్చేవి.. ఈటల సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు.. డ్రామా కంపెనీలు అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

Update: 2024-12-06 07:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు డ్రామా కంపెనీలు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఈ ఎన్నికల్లో తాము ఇంకాస్త సర్దుకుని ఉండి ఉంటే బీజేపీకి మరో నాలుగు సీట్లు వచ్చేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై రేపు సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభను (Sarur Nagar BJP Sabha) ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈటల ఇవాళ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రధాని మోడీ వద్దకు వెళ్లి రాష్ట్రానికి ప్రాజెక్టులు ఎలా తీసుకురావాలి, ఎలా బాగుచేసుకోవాలని ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు ఏంటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishanreddy)పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. కిషన్‌రెడ్డి సూసైడ్ చేసుకున్నా మూసీ ఆగదని అటున్నావంటే రేవంత్ నీకు ఏం అవగాహన ఉన్నట్లు నువ్వేం మనిషివి అంటూ మండిపడ్డారు. సీఎంకు ఇంత అహంకారమా? ఎక్కడిదీ సంస్కృతి, కిషన్‌రెడ్డి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? అని ప్రశ్నించారు.

ఆటో డ్రైవర్ల బంద్‌కు మద్దతు..

గతంలో ఎమ్మెల్యేల భార్యలు, గన్‌మెన్ల ఫోన్లను ట్యాప్ చేయించి, ఇప్పుడు తమ ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నేతలు అనడం విడ్డూరంగా ఉందని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఏం సాధించాడని రేవంత్‌రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి స్థాయిని మరిచి ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై చిల్లర భాషతో మాట్లాడుతున్నాని మండిపడ్డారు. ఈ దఫా తెలంగాణ గడ్డపై నూటికి నూరు శాతం కాషాయ జెండా ఎగురబోతున్నదని ఇటీవల రాష్ట్ర నేతలతో ప్రధాని మోడీ చెప్పారని ఈటల గుర్తు చేశారు. రేపటి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే రేపటి ఆటోడ్రైవర్ల బంద్‌కు బీజేపీ మద్దతు ఉంటుందని ఈటల చెప్పారు.

Tags:    

Similar News