ఆదిలోనే అస్తవ్యస్తం..
కొత్తసర్కారు ప్రజల వద్దకే వచ్చి, వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల ఫలాలను అందించేందుకు గురువారం నుంచి ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆదిలోనే అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తాయి.
దిశ, సిటీబ్యూరో : కొత్తసర్కారు ప్రజల వద్దకే వచ్చి, వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల ఫలాలను అందించేందుకు గురువారం నుంచి ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆదిలోనే అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తాయి. గ్రేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లలో చాలా చోట్ల దరఖాస్తుదారులకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటంతో ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. దాదాపు అన్ని కౌంటర్లలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైనా, రెండు నుంచి మూడు గంటల్లోపే దరఖాస్తులు అయిపోయాయి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 30 సర్కిళ్లలో సర్కిల్‌కు ఒకరు చొప్పున ఉన్నతాధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించినా, ప్రజాపాలన మొదటి రోజు సర్కారుకు అంచనాలకు భిన్నంగా జరిగింది.
ఏకంగా రెండు చోట్ల డ్యూటీలు వేయటంతో ఎక్కడికెళ్లి విధులు నిర్వర్తించాలో తెలియక ఉద్యోగులు తాము పనిచేస్తున్న ఆఫీసులకు తిరిగి వచ్చారు. ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో కౌంటర్లు తొమ్మిది గంటల తర్వాత ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు కౌంటర్లను ఏర్పాటు చేసి, 10 గంటల నుంచి దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. మొత్తానికి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫలాలను ప్రజలకు అందించేందుకు సర్కారు చిత్తశుద్ధితోనే ఉన్నా, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయటంలో కొంత వరకు విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవగాహన లేక..
గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో ఏర్పాటు చేసిన దాదాపు 600 కౌంటర్లలో దరఖాస్తు ఎలా పూరించాలో, ఎలా సమర్పించాలో తెలియక జనాలు అవస్థలు పడ్డారు. ఆరు గ్యారెంటీల పై స్పష్టమైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నాలుగు గ్యారెంటీలకు సంబంధించిన నాలుగు ఫారాలను సమర్పించటం కనిపించింది. వీరికి సహకరించేందుకు సర్కారు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించిన, వారి నుంచి ప్రజలకు అందిన సహకారం అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. నాంపల్లి నియోజకవర్గంలో వాలంటీర్లు లేకపోవటంతో స్థానిక యువతీ యువకులే వాలంటీర్లుగా వ్యవహరిస్తూ స్థానికుల దరఖాస్తులను నింపారు. మరికొన్ని చోట్ల స్థానిక జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కౌంటర్‌కు సమీపంలో టేబుల్స్ వేసుకుని రూ.100కో దరఖాస్తును నింపటం కనిపించింది.