3 పథకాలు.. 6 ఆత్మహత్యలు.. 9 ఏళ్ల KCR పాలనలో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువ!

వ్యవసాయ రంగంలో యావత్​దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఎత్తుకున్నారు.

Update: 2023-06-03 04:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ రంగంలో యావత్​దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఎత్తుకున్నారు. రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు 2018లో రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లను ప్రవేశపెట్టి అప్పటివరకూ అమలవుతున్న పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పావలా వడ్డీ, వడ్డీలేని రుణాలు, యాంత్రికీకరణ లాంటివన్నీ ఎత్తివేశారు. రైతుల ఆత్మహత్యలే లేవంటూ ప్రభుత్వం ప్రకటించుకుంటున్నా అప్పుల బాధతో ఆ సమస్య కొనసాగుతూనే ఉన్నది.

దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్ 3వ తేదీని వ్యవసాయ రంగానికి అంకితం చేసిన ప్రభుత్వం ఆ రంగంలో సాధించిన విజయాలను ‘రైతు దినోత్సవం’న ఏకరువు పెట్టాలనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యేలు పరోక్షంగా ఎన్నికల ప్రచారానికి దోహదపడేలా షెడ్యూలు రూపొందింది. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఈ రంగంలో విజయాల సంగతి ఎలా ఉన్నా వైఫల్యాలే ఎక్కువ. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, హామీలు.. వాటి అమలులో క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉన్నాయి.

కౌలు రైతులకేదీ ధీమా?

క్లెయిమ్: కౌలు రైతుల్ని ప్రభుత్వం గుర్తించడంలేదు. వారికి రైతుబంధు, రైతుబీమా ఇవ్వలేం.

వాస్తవం: రాష్ట్రంలో పట్టాదారు పాస్‌బుక్కులు ఉన్న రైతులు సుమారు 66 లక్షల మంది ఉన్నారు. వీరికి తోడు సుమారు 35%-40% మంది కౌలు రైతులు భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇందులో ఐదోవంతు మంది అంగుళం కూడా సొంత భూమి లేని పేద రైతులు. కౌలు రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా గుర్తించడంలేదు.

రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీమ్‌లకు అర్హులు కారు. పట్టాదారు పాస్‌బుక్కులు లేకపోవడంతో బ్యాంకుల నుంచి పంట రుణాలూ అందడంలేదు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ, సహకారమూ అందదు. భూ యాజమాన్య హక్కు వివాదాల కారణంగా వీరిని రైతులుగా గుర్తించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేశారు. బతికున్నప్పుడేకాక చనిపోయిన తర్వాత కూడా వీరికి రైతుగా గుర్తింపు లేదు. జీవో 194ను అమలుచేయకపోవడంతో చనిపోయిన తర్వాత పరిహారానికీ నోచుకోలేకపోతున్నారు.

రైతుబంధు

క్లెయిమ్: 2018 మే 10న ఈ స్కీమ్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి 65 లక్షల మందికి రూ. 65,910 కోట్లను ఆర్థిక సాయం.

వాస్తవం: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్‌తో పేద రైతులకు పంట సాయం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నిజానికి ఇందులో ఎక్కువగా లబ్ధి పొందుతున్నది సంపన్నులే. 20 ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్న సుమారు 6 వేల మందికి పైగా భూస్వాములకు సంవత్సరానికి సగటున రూ. 13.37 లక్షల చొప్పున మొత్తం రూ. 784 కోట్ల మేర అందింది. ముఖ్యంగా ఈ పథకం కౌలు రైతులకు వర్తించదు. కానీ, రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న వారిలో అత్యధికులు వారే.. గివ్ ఇట్ అప్ అనే పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన లేదు. 2021వరకు గివ్ ఇట్ అప్ కింద స్పందించింది కేవలం 2,732 మందే.

రైతుబీమా

క్లెయిమ్: రైతులు ఏ కారణంచేత మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

వాస్తవం: ఈ స్కీమ్‌ను 2018లో అమల్లోకి తెచ్చినప్పటి నుంచి సుమారు లక్ష మంది రైతులు చనిపోయారు. రైతుబీమా అందుకున్నవారిలో ఎక్కువ కుటుంబాలు ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్నవారే. 2018-19లో మొత్తం 17,841 మంది చనిపోతే అందులో 16,198 మంది వారే. ఆ తర్వాతి ఏడాదిలో మొత్తం 8,857 మందిలో కేవలం 789 మంది మాత్రమే ఐదెకరాలకు పైన ఉన్నవారు. మిగిలినవారంతా బక్క రైతులే.

ఆత్మహత్యలు

క్లెయిమ్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి.

వాస్తవం: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2021 వరకు ఏడేండ్ల కాలంలో 6,473 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటున్నది తెలంగాణలోనే. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టడానికి ముందు 4,432 మంది చనిపోతే ఆ తర్వాత 2,230 మంది సూసైడ్ చేసుకున్నారు.

రాష్ట్ర పోలీసు విభాగమే ఈ లెక్కలను సేకరించింది. అనధికార లెక్కలు దీనికి మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జీవో 194 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.ఐదు లక్షల పరిహారం అందేది. రైతుబీమా స్కీమ్ రావడంతో ఆ జీవోను ప్రభుత్వం అటకెక్కించింది. పాత ప్రభుత్వంలో ఉన్న జీవో స్థానంలో రైతుబీమాను తీసుకొచ్చి తనదిగా బీఆర్ఎస్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటున్నది.

రుణమాఫీ

క్లెయిమ్​: బ్యాంకు రుణాలు భారం కావద్దని రుణమాఫీ అమలు

వాస్తవం: ఫస్ట్ టర్మ్‌లో నాలుగు విడతలుగా 35.31 లక్షల మంది రైతులకు రూ. 16,144 కోట్ల మేర మాఫీ చేసిన ప్రభుత్వం రెండో టర్మ్‌లో రెండు విడతల్లో రూ. 1,207 కోట్లను 5.42 లక్షల మందికి మాఫీ చేసింది. నాలుగున్నరేళ్లు పూర్తయినా అనుకున్న లక్ష్యం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. లక్ష రూపాయల వరకు రుణాల మాఫీకి రూ. 27,487 కోట్లు అవసరమవుతున్నా కేవలం రూ. 35 వేల పరిమితి వరకే అమలైంది.

పావలా వడ్డీ రుణాలు

క్లెయిమ్​: పావలావడ్డీ, వడ్డీలేని రుణాలకు నిధులిస్తున్నాం.

వాస్తవం: రైతుల కోసం ‘వడ్డీ లేని రుణాలు’ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడు లక్షల రూపాయల వరకు అప్పు తీసుకుంటున్న రైతులు తిరిగి చెల్లించడానికి సులువుగా ఉండేలా ‘పావలా వడ్డీ’ స్కీమ్‌ వచ్చింది. కానీ ఈ రెండూ అరకొరగానే అమలవుతున్నాయి. ఇప్పటివరకూ రూ. 225 కోట్లను ఖర్చు చేసింది. రైతుబంధుతో ఇవన్నీ అటకెక్కాయి. ఇంకా రూ. 725 కోట్ల మేర బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది.

పంట నష్టపరిహారం

క్లెయిమ్​: అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించనున్నాం.

వాస్తవం: వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున మొత్తం 2.28 లక్షల ఎకరాలకు రూ. 228 కోట్లను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకాలేదు. చెక్కుల ద్వారా ఇవ్వనున్నట్లు చెప్పినా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌తోనే సరిపెట్టింది.

భూమి ఉన్నోళ్లకే లబ్ధి

క్లెయిమ్: తెలంగాణ రైతులు సంపన్నులు అని చెప్పుకోవాలి.

వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెస్తున్న పథకాలన్నీ భూములు ఉన్నోళ్ల కోసమే. జానెడు భూమిలేని నిరుపేదలకు కేసీఆర్ ఇస్తున్నది గుండు సున్నా. గతంలో భూమిలేని పేద దళితులకు మూడెకరాల భూమి అని ఊరించి అర్ధంతరంగా ఆపివేశారు. 2017 సామాజికాభివృద్ధి నివేదిక ప్రకారం గ్రామీణ జనాభాలో 43% కుటుంబాలకు సొంతభూమి లేదు. ఇందులో దాదాపు 49% మంది బీసీలుకాగా, 34% ఎస్సీ కుటుంబాలు. ఇప్పుడు కౌలుకు సాగుచేస్తున్న రైతుల్లోనూ ఎక్కువ మంది ఎస్సీ, బీసీలే. మరోవైపు సాగులో లేకపోయినా సొంత భూమి ఉన్న పట్టాదారులకు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తున్నాయి.

రైతు వేదికలు

క్లయిమ్: ప్రతి ఐదు వేల ఎకరాల పరిధిలో ఒక రైతువేదిక చొప్పున 2,601 ప్రాంగణాల నిర్మాణం. రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యం

వాస్తవం: ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షల చొప్పున మొత్తం 2,601 వేదికలకు రూ. 572 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో దాదాపు సగం (ఒక్కో వేదికకు రూ. 10 లక్షలు) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉపాధి హామీ నిధులను రాష్ట్రం ఖర్చు చేసింది. ఈ స్కీమ్ తమదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటున్నది. ఈ వేదికల్లో ఇప్పటివరకూ రైతులకు శిక్షణ తరగతులేవీ జరగలేదు. అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ధాన్యాన్ని దాచుకునే గోదాములుగానూ ఇవి ఉపయోగపడడంలేదు.

ఇతర స్కీమ్‌లు..

క్లెయిమ్​: వ్యవసాయ యాంత్రికీకరణకు రూ. 951 కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ. 225 కోట్లు చెల్లించాం.

వాస్తవం: రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ యాంత్రికీకరణ స్కీమ్ అమలు అంతంతే. ప్రభుత్వం రూ. 1,096 కోట్లను విడుదల చేసినా అందులో రూ. 766 కోట్లు మాత్రమే ఖర్చయింది. కేంద్రం నుంచి వచ్చిన స్వల్ప నిధుల్లో (రూ. 33.66 కోట్లు)నూ రెండేళ్ల ఫండ్ (రూ. 8.39 కోట్లు) ఖర్చు కాకుండా నిరుపయోగంగా మిగిలిపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా లాంటి చాలా స్కీములు కనుమరుగయ్యాయి.

రైతు సమన్వయ సమితులు

క్లెయిమ్​: రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు సమన్వయ సమితులు.

వాస్తవం: ప్రభుత్వం తొలుత రైతు సమనస్వయ సమితులను ఏర్పాటు చేసింది. మొత్తం 10,768 గ్రామాల్లో 1.61 లక్షల మందితో ఇవి ఏర్పడినా ఏనాడూ రైతులకు అందుబాటులో లేవు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నా రైతులకు ఉపయోగపడలేదు. రైతుబంధు స్కీమ్ వచ్చిన తర్వాత ఇవి రైతుబంధు సమన్వయ సమితులుగా పేరు మార్చుకున్నాయి. సభ్యులకు గౌరవ భృతి చెల్లిస్తామని చెప్పినా అమల్లోకి రాలేదు.

గోదాముల నిర్మాణం

క్లెయిమ్​: సుమారు పాతిక లక్షల టన్నుల సామర్థ్యంలో 456 గోదాములను నిర్మించుకున్నాం.

వాస్తవం: రాష్ట్రం ఏర్పడడానికి ముందు నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండగా ఇప్పుడు 24.71 లక్షల టన్నులకు సరిపోయేలా 1,167 గోదాములు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర వర్షాలకు రైతుల ధాన్యం తడిచిపోతున్నా నివారణ చర్యలు లేవు. కనీసం షెడ్లు వేసే చొరవను కూడా ప్రభుత్వం తీసుకోలేదు. ధాన్యం ఆరబెట్టుకోడానికి కల్లాలను నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్నా చివరకు రోడ్ల మీదనే ఆధారపడ్డారు రైతులు.

గిట్టుబాటు ధర

క్లెయిమ్​: చివరి గింజ వరకూ కొంటాం.. ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పిస్తున్నాం.

వాస్తవం: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. తాలు, తరుగు, తేమ పేరుతో ఐకేపీ కేంద్రాలు రైతులను ఇబ్బంది పెట్టాయి. మంత్రి గంగుల కమలాకర్ గంభీర ప్రకటనలు చేసినా ఫలితం లేకపోయింది. విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకు రైతులు ప్రైవేటు బయ్యర్లకు, రైస్ మిల్లులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోయారు.

నియంత్రిత సాగు

క్లెయిమ్​: క్రాప్ కాలనీలుగా విభజించి నియంత్రిత సాగు విధానాన్ని అవలంభిస్తాం. పాటించకపోతే రైతుబంధు సాయం కట్ చేస్తాం.

వాస్తవం: నియంత్రిత సాగు, వరి వేస్తే ఉరి, పత్తి సాగును పెంచండి, సన్నాలే పండించండి, వెద పద్ధతిని అనుసరించండి.. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో ఆదేశం రావడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. మొక్కజొన్న వేస్తే గింజను కూడా కొనమంటూ ప్రభుత్వం హెచ్చరించినా రైతులు వినలేదు. క్రాప్ కాలనీలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. కేంద్రంతో పారాబాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్రానికి భిన్నాభిప్రాయం, ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో రైతులు వారి వడ్లను అమ్ముకోడానికి తిప్పలు పడ్డారు.

పాలీ.. గ్రీన్ హౌజ్ ఫార్మింగ్

క్లెయిమ్​: పాలీహౌజ్ విధానంలో 1210 ఎకరాలకు రూ.299 కోట్లు ఖర్చు చేశాం.

వాస్తవం: అధిగ దిగుబడికి పాలీహౌజ్, గ్రీన్ హౌజ్ వ్యవసాయ విధానాన్ని తొలినాళ్లలో ప్రోత్సహించిన ప్రభుత్వం సబ్సిడీలనూ ప్రకటించింది. బ్యాంకు రుణాలతో రైతులు ఈ సేద్యంవైపు వెళ్లినా కొద్దికాలానికే అది పరిమితమైంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆశించిన మేరకు పనిచేయడంలేదు. ఈ స్కీమ్ కోసం రాష్ట్రం రూ. 299 కోట్లను ఖర్చు చేసినట్లు ప్రకటించింది. నేషనల్ హార్టికల్చరల్ మిషన్ పేరుతో కేంద్రం నుంచి తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ. 159 కోట్లు అందాయి. రాష్ట్రం మొత్తంమీద కేవలం 917 మంది రైతులు 1150 ఎకరాల మేర లబ్ధి పొందారు.  

Also Read...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ షాక్ ఇస్తున్న క్యాడర్

Tags:    

Similar News