'చలో ఎస్పీడి ఆఫీస్' ఉద్రిక్తం.. ఐదుగంటల పాటు ఉద్యోగులచే దిగ్బంధం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్ల ల సాధన కోసం

Update: 2023-07-20 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్ల ల సాధన కోసం దాదాపు 5 గంటలపాటు వర్షాన్ని లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో ఎస్పీడి ఆఫీస్ ఉద్రిక్తంగా మారింది. ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నా, గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా తమకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వటం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసనలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా ఫలితం లేనందున డియస్ఈ ముట్టడి చేయాల్సిన పరిస్థితి అనివార్యం అయిందన్నారు. న్యాయమైనవైనందున అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఎస్ శాంతి కుమారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.


Similar News