పాలమూరును ఎండబెట్టి ఆంధ్రా, రాయలసీమకు నీళ్లను తరలించిండ్రు: మంత్రి నిరంజన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాలలో వెనకకు నెట్ట వేయబడిందని, తెలంగాణ ఆదాయంతో ఆంధ్రకు నీళ్లు తరలించుకుపోయారని, పాలమూరు జిల్లాను బీడుగా మార్చారని , అలాంటి తరుణంలో ప్రత్యేక రాష్ట్రం సాధించాక సాగునీటి కలను నిజం చేసుకున్నామని నేడు పాలమూరు జిల్లా పచ్చటి ఫైర్లతో కళకళలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-07 13:56 GMT

దిశ ప్రతినిధి, వనపర్తి: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాలలో వెనకకు నెట్ట వేయబడిందని, తెలంగాణ ఆదాయంతో ఆంధ్రకు నీళ్లు తరలించుకుపోయారని, పాలమూరు జిల్లాను బీడుగా మార్చారని , అలాంటి తరుణంలో ప్రత్యేక రాష్ట్రం సాధించాక సాగునీటి కలను నిజం చేసుకున్నామని నేడు పాలమూరు జిల్లా పచ్చటి ఫైర్లతో కళకళలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం నాగవరంలోని శ్రీనివాస పద్మావతి గార్డెన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో  మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదాయ వనరులన్నీ ఆంధ్రకు తరలించకపోయారని, రాయలసీమలో అక్రమంగా 400 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు నిర్మించుకున్నారని, పాలమూరు జిల్లా ఎండబెట్టి ఆంధ్ర, రాయలసీమకు సాగునీటిని తరలించుకుపోయారని మంత్రి విమర్శించారు. ఆ రిజర్వాయర్లకు అక్రమంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రా విడిపోయి 9 ఏళ్లు అవుతున్నా కేంద్రంలోని ప్రభుత్వం సాగునీటి వాటాను తేల్చడం లేదని మంత్రి విమర్శించారు.

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువకు 60 మీటర్ల దిగువన ఉన్న వనపర్తికి సాగునీళ్లు లేకుండా చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ఒప్పించి కేఎల్ఐ నుంచి సాగునీళ్లు సాధించుకున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా ఎత్తిపోతల మీద విపక్ష నేతలు కేసులు వేశారని ఇది వారి నీచ సంస్కృతికి నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు. వనపర్తికి నేడు నీటి కొరత లేదని ఇక ముందు రాకూడదని అదే నా జీవిత లక్ష్యమని ఆయన అన్నారు.

11 నెలల రికార్డు సమయంలో ఘణపురం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం చేసుకున్నామని అలాగే 24 కిలోమీటర్ల కాలువను 11 నెలలలో పూర్తి చేశామని, 35 ఏళ్ల తర్వాత కృష్ణమ్మ నీళ్లతో గణపసముద్రం అలుగు పారించామని, అన్ని వాగుల మీద 15 చెక్ డ్యాంలు నిర్మించామని రైతులు సాగు చేసుకుంటుండగా పిల్లలు ఈతలు కొడుతున్నారని అన్నారు. మరో రూ.30 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని నేడు వనపర్తిలో కరువు లేదని అన్నారు. సాగునీటి కలను నిజం చేసుకున్నామని, అందుకే సాగునీటి పండగ చేసుకుంటున్నామని, రేపు ప్రతి చెరువు, కుంట మీద ప్రజలు సంబరాలు చేసి గ్రామ దేవతలకు మొక్కి అందరం సహాపంక్తి భోజనాలు చేయబోతున్నామని మంత్రి చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పలువురు అధికారులు మాట్లాడారు. అనంతరం సాగునీటి విజయంపై రూపొందించిన ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు.

Tags:    

Similar News