ప్రీతి విషాదంలో దర్యాప్తు సరైన దిశలోనే జరుగుతోందా?

వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరిగిందా అనే​ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2023-03-05 15:51 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వైద్య విద్యార్థిని ప్రీతి విషాదాంతంలో మిస్టరీ త్వరలోనే వీడనున్నదని తెలుస్తున్న నేపథ్యంలో అసలు పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరిగిందా? అన్న​ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంలో ఇప్పటికే ప్రీతి విషాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న కాకతీయ మెడికల్​కాలేజీ అనస్తీషియా డిపార్ట్​మెంట్​హెచ్​వోడీ నాగార్జునరెడ్డిని జరిగిన సంఘటనపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా పెట్టటం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసులు ప్రీతి విషాదాంతంలో అరెస్టయిన సీనియర్​వైద్య విద్యార్థి సైఫ్​పై ఇన్ఫర్మేషన్​టెక్నాలజీ యాక్ట్​‌‌–2000 ప్రకారం కేసులు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ముందుకొస్తోంది. మరోవైపు ప్రీతి కుటుంబసభ్యులు ఖచ్చితంగా జరిగింది హత్యేనని ఆరోపిస్తున్నారు.

లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​ప్రెస్​క్లబ్​లో జరిగిన రౌండ్​టేబుల్​సమావేశంలో పాల్లొన్న పలు సంఘాల నేతలు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ప్రీతిది హత్యేనని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్​కమిషనర్​రంగనాథ్​ను సోమవారం తన కార్యాలయానికి రావాలని డీజీపీ అంజనీకుమార్ చెప్పినట్టు తెలుస్తుండటం గమనార్హం. ప్రీతి కేసుకు సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు కొనసాగిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను తెలుసుకునేందుకే డీజీపీ అంజనీకుమార్​ వరంగల్ ​కమిషనర్​ను పిలిచినట్టు సమాచారం.

కాకతీయ మెడికల్​కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై వరంగల్​కమిషనర్​రంగనాథ్​మీడియాతో మాట్లాడుతూ ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ప్రీతికి చెందిన ఎమర్జన్సీ అనస్తిషియా కిట్​నుంచి సక్సీనైల్కొలిన్​అనే అనస్తీషియా మందు ఖాళీ సీసాను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దాంతోపాటు ఫెంటానైల్​అనే మందు సీసా కూడా ఆమె కిట్​లో దొరికిందన్నారు. సీనియర్​అయిన సైఫ్​ఆమెను వేధింపులకు గురి చేశాడని చెబుతూ పధ్నాలుగా వాట్సాప్​ఛాటింగులను ప్రీతి మొబైల్​నుంచి రిట్రీవ్​చేశామన్నారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవటానికి కారకుడయ్యాడని ఐపీసీ 306 సెక్షన్​తోపాటు ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టామన్నారు. దాంతోపాటు ర్యాగింగ్​నేరారోపణల మీద కూడా కేసులు నమోదు చేశామన్నారు.

ఆ సెక్షన్​ ఎందుకు పెట్టలేదు?

కాగా, సైఫ్​పై ఇన్ఫర్మేషన్​టెక్నాలజీ యాక్ట్​–2000 సెక్షన్​67 ప్రకారం ఎందుకు కేసులు నమోదు చేయలేదన్న ప్రశ్న ప్రస్తుతం ముందుకొస్తోంది. సీనియర్​అడ్వకేట్​ రాహుల్​తో మాట్లాడగా వాట్సాప్​ఛాటింగ్​ద్వారా సైఫ్​తన జూనియర్​అయిన ప్రీతిని అవహేళన చేస్తూ గ్రూప్​లో పోస్టులు పెట్టినట్టు స్వయంగా కమిషనర్​ రంగనాథ్​చెప్పటాన్ని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వేధింపులే నిజమైతే ఇంటర్​నెట్ ను వాడుకోవటం ద్వారా ప్రీతిని వేధించిన సైఫ్​పై ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్​టెక్నాలజీ యాక్ట్​సెక్షన్​67 ప్రకారం కేసులు పెట్టాల్సి ఉండేదన్నారు. అప్పుడు కేసు మరింత పటిష్టంగా ఉండేదని చెప్పారు. అలా చేయకపోవటం వల్ల కేసు కోర్టుకు విచారణ నిమిత్తం వచ్చినపుడు బలహీనపడే అవకాశాలు ఉంటాయన్నారు.

హైదరాబాద్​కు కమిషనర్​

ప్రీతి విషాదాంతంపై ఆమె కుటుంబసభ్యులు హత్య అని ఆరోపణలు చేస్తుండటం, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితోపాటు పలువురు నేతలు ప్రీతి విషాదాంతంపై ప్రభుత్వం, పోలీసుశాఖపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలేం జరిగింది? ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలు ఏమిటి? తదితర వివరాలు తెలుసుకునేందుకు డీజీపీ అంజనీకుమార్​ వరంగల్​కమిషనర్​ రంగనాథ్​ను సోమవారం తన కార్యాలయానికి రావాలని సూచించినట్టు తెలుస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News