దిశ ప్రతినిధి, వరంగల్: డోర్నకల్ రాకీయంలో కీలక మార్పు చోటుచేసుకోనుందా..? డోర్నకల్ రాజకీయాల్లో భీష్ముడిగా పేరుగాంచిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ వారసురుడిగా రవిచంద్ర రాజకీయ రంగప్రవేశం చేయడం ఖరారైపోయిందా..? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని రెడ్యానాయక్ భావిస్తున్నారా..? అధిష్టానం కూడా రెడ్యాపై భారం వేసి సరేనందా..? అంటే డోర్నకల్ టీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి, రెడ్యానాయక్‌కు అత్యంత సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ధరంసోతు రవిచంద్రను బరిలోకి దింపడం దాదాపుగా ఖాయంగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు సైతం ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తన అభిలాషను వారి ఎదుట వ్యక్తం చేయగా, వారు సానుకూలంగా స్పందించినట్లుగా నియోజకవర్గ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. అయితే రవిచంద్ర ఎంపికపై కొంతమంది నేతలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నా.. రెడ్యానాయక్ సమర్థతను చూసి సరే అంటున్నట్లు సమాచారం.
కొడుక్కి బ్రేక్ త్రూ ఇవ్వాలని రెడ్యా ఆరాటం..
ఎనిమిది పదుల వయస్సుకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ రాజకీయ వారసుడిగా కొడుక్కు రవిచంద్రను నిలదొక్కుకోవాలనే ఆకాంక్షతో ఉన్నాడు. డోర్నకల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన రెడ్యా.. ఆ తర్వాత కూతురు మాలోతు కవితను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. కీలక నేతగా తీర్చిదిద్దారు. వైఎస్సార్ హయాంలో రెడ్యానాయక్ మంత్రిగా పనిచేయగా.. కూతురు మాలోతు కవిత మానుకోట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మానుకోట ఎంపీగా ఉన్నారు. అయితే కొడుకు రవిచంద్రను రాజకీయాల్లోకి తీసుకురావడానికి గత ఎన్నికల సమయంలోనే పావులు కదిపినా.. రాజకీయ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో వయోభారంతోనే రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రవిచంద్రకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించాలనే తాపత్రయంతో రెడ్యానాయక్ ఇప్పటి నుంచే అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. రవిచంద్రను గెలిపించుకునే పూర్తి బాధ్యతను ఇటు ఎంపీ కవిత, తండ్రి రెడ్యానాయక్ తమదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి దశ దిన కర్మ రోజున పరామర్శకు వచ్చిన కేటీఆర్‌కు కొడుకు రవిచంద్రను కేటీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేస్తూనే.. కేటీఆర్‌కు పాదాభివందనం చేయించడం గమనార్హం.
ఆ నియోజకవర్గంలో ఆజాత శత్రువులు..
డోర్నకల్ రాజకీయాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ రెడ్యానాయక్ పోరు కొనసాగుతోంది. డోర్నకల్ రాజకీయాల్లో యోధగా పేరుగాంచిన రెడ్యానాయక్‌పై 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యవతి 5 వేలకు పైగా పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయం కావడంతో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె డోర్నకల్ రాజకీయ తెరపై తన ప్రతిభను చాటుకోలేకపోయారు. ఆ తర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరుకున్న ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో రెడ్యా నాయక్ కూతురు కవితతో కలిసి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇద్దరు రాజకీయ ఆజాత శత్రువులు ఒకే పార్టీలో మెలగాల్సిన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్‌లకే సీట్లు ప్రాతిపదికన 2018లో అసెంబ్లీ టికెట్లు ఖరారు కావడంతో రెడ్యాకే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. సత్యవతి రాథోడ్ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని అంతా అనుకుంటున్న సమయంలో అధినేత కేసీఆర్ కొన్నాళ్లకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. ఆ వెనువెంటనే ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకోని రాజకీయ వర్గాలను సైతం అబ్బురపరిచారు.
సత్యవతికి అక్కడ....రవిచంద్రకు ఇక్కడ..?
డోర్నకల్ టీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. డోర్నకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను నిలపడం, ములుగు నియోజకవర్గం కానీ మరేదైనా నియోజకవర్గం నుంచైనా మంత్రి సత్యవతి రాథోడ్‌కు టికెట్ కేటాయించడం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ తనకు బదులుగా కొడుక్కి టికెట్ ఇవ్వాలనే గట్టి వాదనను అధిష్టానం పెద్దల వద్ద వినిపిస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధిష్టానం నుంచి సానుకూలంగా ప్రకటన వస్తుందనే రెడ్యా అనుచరులు బలంగా నమ్ముతున్నాయి. అలా కాదని మంత్రి సత్యవతిరాథోడ్‌కు ఇస్తే మాత్రం రెడ్యా అనుచరులు ఖచ్చితంగా సహకరించరని కుండబద్ధలు కొడుతుండటం గమనార్హం. రాష్ట్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే వాదన తెరపైకి రావడంతో టికెట్లు ఎవరెవరికి అన్నా అంశంపై నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్‌లో డోర్నకల్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో మరి కొద్దిరోజులు ఆగితేగాని ఇప్పుడేం చెప్పలేం..!