ఎలా రా గ్రాడ్యుయేట్స్ అయ్యారు? బ్యాలెట్ పేపర్లపై పట్టభద్రులు చేసిన పని ఇదే?
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూర్యో: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోటీ పడుతూ 5వ స్థానంలో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయని తెలిసింది. బ్యాలెట్ పేపర్ల కొంత మంది ఓటర్లు లవ్ సింబల్స్, జై మల్లన్న, జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ కొందరు.. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ తిరిగేసి అంకెలు వేశారని తెలిసింది. అయితే, ఇప్పటి వరకు లెక్కించిన మొత్తం 1,92,277 ఓట్లలో సుమారు 15,126పైగా చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చెల్లని ఓట్లు అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
కాగా, బ్యాలెట్ పేపర్లపై రకరకాల గుర్తులు గ్రాడ్యుయేట్స్ వేయడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘ఓట్లు వేయడం రాదు గాని ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి ఏం చదువులు రా నాయనా మివి’ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓట్లు వేయడం రాదు.. ఎలా రా గ్రాడ్యుయేట్స్ అయ్యారు? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 56,113 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.