సారొస్తారా..? హాట్ టాపిక్‌గా కేసీఆర్ రెగ్యులర్ విజిట్
సీఎం కేసీఆర్ కోరుకున్నట్టుగా సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ కోరుకున్నట్టుగా సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. ఎలాంటి దోషాలు లేకుండా పక్కా వాస్తు ప్రకారం నిర్మించారు. చూపరులను ఆకట్టుకునే తీరుగా సొగసులను అద్దారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో చాంబర్లు, మీటింగ్ హాల్స్ రూపొందించారు. ఇన్ని చేసినా సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు రెగ్యులర్‌గా వస్తారా? లేక పాత పద్ధతినే అనుసరిస్తారా? అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది.
నిత్యం వస్తారా?
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సెక్రటేరియట్‌కు పాలన సౌలభ్యంగా లేదనే కారణంతో ఆ బిల్డింగ్స్‌ను కూల్చివేసి కొత్తది నిర్మించారు. అయితే వాస్తు అనే మూఢ నమ్మకంతో కేసీఆర్ బిల్డింగ్స్‌ను కూల్చుతున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని కేసీఆర్ ఆయన అనుకున్నతీరుగా కొత్త బిల్డింగ్ నిర్మించి కల నెరవేర్చుకున్నారు. అయితే కొత్త సెక్రటేరియట్‌కు సీఎం నిత్యం వస్తారా? అక్కడే రివ్యూలు, మీటింగ్స్ నిర్వహిస్తారా? విజిటర్స్‌ను కలుస్తారా? లేకపోతే ఆయనకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే అడుగుపెడుతారా? అని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. కొత్త బిల్డింగ్ నిర్మించిన తర్వాత కేసీఆర్ రెగ్యులర్‌గా రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.
కొత్త బిల్డింగ్‌లో కేబినెట్ ఎప్పుడు?
ఈనెల 30న సెక్రటేరియట్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ అదేరోజు లేకపోతే మరుసటి రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ మే 4న బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్ నిర్వహించే చాన్స్ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాల అమలు తీరుపై కొత్త సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించి, అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తున్నది.
ప్రగతిభవన్ ప్రియారిటీ తగ్గుతుందా?
రెండోసారి సీఎం కేసీఆర్ బాధ్యతలు చేటపట్టిన తర్వాత రాష్ట్ర పాలనతో పాటు రాజకీయాల్లో ప్రగతిభవన్‌కు అత్యంత ప్రాధాన్యత వచ్చింది. అక్కడే రివ్యూలు, మీటింగ్స్, కేబినెట్ సమావేశాలు జరిగాయి. కీలకమైన పలు నిర్ణయాలు అక్కడే తీసుకున్నారు. మరి ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రగతిభవన్‌లో పాలన నిర్ణయాలు జరుగుతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రగతిభవన్‌లోకి ఎవరు వెళ్లినా, అక్కడ ఏం జరిగినా అధికారికంగా చెప్పేవరకు బయటికి రాదు. మరి ఇప్పుడు ప్రగతిభవన్‌లో కేవలం రాజకీయ బేటీలు మాత్రమే నిర్వహిస్తారా అనే చర్చ జరుగుతోంది.