అధికారులే అనుమతిలిచ్చి ఇండ్లు కూలుస్తారా? : ఎంపీ ఈటల ఫైర్
ఉప్పల్ పరిధి పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ సాయిప్రియ ఎంక్లేవ్ ఇండ్ల కూల్చివేతపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఉప్పల్ పరిధి పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ సాయిప్రియ ఎంక్లేవ్ ఇండ్ల కూల్చివేతపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్నా కూల్చడానికి అధికారులకు తెలివి లేదని ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రియ ఎంక్లేవ్ లో ఉన్న వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అని ఆయన వివరించారు. అలాంటిది అన్ని అనుమతులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా వారి ఇండ్లను కూల్చివేసిందని ధ్వజమెత్తారు. అప్పట్లో అనుమతి ఇచ్చింది అధికారులే కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారవచ్చని, కానీ అధికారలు మారరు కదా అంటూ ఈటల విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం లాగే రేవంత్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఈటల పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నా కూడా కూల్చడమేంటని ఆయన ప్రశ్నించారు.
గంజాయి, గుడుంబా అమ్మేవాళ్లను పట్టుకునే సోయి లేదు కానీ పేదలపై దౌర్జన్యమేంటని రాజేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఒళ్ళు వంచి అధికారంలోకి రాలేదని, కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ కు ఓటేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈటల వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రికి కాల్ చేస్తే తమకు తెలియదని చెబుతున్నారన్నారు. ఆ ఏరియా తన ఎంపీ పరిధిలోకి వస్తుందని, అయినా కొన్న భూములకు 118 జీవో ఇష్యూ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు అందుకున్నకాడికి దండుకోవాలని చూస్తున్నారు తప్పితే.. ప్రజల సంక్షేమంపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేద్దామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారేమోనని, అలా చేసిన వాళ్లు ఏమయ్యారో తెలుసు కదా అంటూ ఈటల చురకలంటించారు. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయని, అధికారులు 30 నుంచి 35 ఏళ్లు ఉంటారన్నారు. ఇండ్లు కూల్చినందుకు బాధితులకు క్షమాపణ చెప్పి నష్ట పరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ ఇండ్లు కూల్చిన అంశం సీఎంకు తెలుసో లేదో అనేది తనకు తెలియదని, దీనిపై సీఎం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.