దానం నాగేందర్‌పై డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దానం నాగేందర్ మీద స్పీకర్ కి డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామంటే.. అందుబాటులో లేరని, ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని, సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నారని, ఇదేనా ప్రజాపాలన అని బీజేఎల్సీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దానం నాగేందర్ మీద స్పీకర్ కి డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామంటే.. అందుబాటులో లేరని, ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని, సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నారని, ఇదేనా ప్రజాపాలన అని బీజేఎల్సీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఆరు అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చానని, ఇందులో ఏ ఒక్క దాని మీద చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. నేను సివిల్ సప్లై శాఖ మీద చేసిన ఆరోపణలకు స్పందించని అసమర్థత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ.. వందల కోట్ల అవినీతి జరుగుతున్నా కనీసం మంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదే మంత్రి ఇరిగేషన్ శాఖకు కూడా మంత్రిగా ఉన్నారని, ఆ డిపార్ట్మెంట్‌లో జరిగే అవినీతిపై త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతానని, కాళేశ్వరం మీద మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని స్పష్టం చేశారు.
ప్రజాపాలన అంటే ఇదేనా?
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని, పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి రాగానే ప్రైవేటు ఆసుపత్రి ఇనాగురేషన్‌కి వెళ్ళారని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా వేయలేదు. కానీ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపోతే అరెస్ట్ చేస్తున్నారని, డాక్టర్లు నిరసన తెలిపితే వారికి సైతం ఆంక్షలు పెట్టారని, మీడియాపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్ లపై మీరే షెడ్యూల్ ఇచ్చారని, డీఎస్సీ నోటిఫికేషన్, లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో సీఎం చెప్పాలన్నారు. గతంలో పీసీసీ గా ఉన్న సీఎం రేవంత్ పార్టీ మారిన ఎంఎల్ఏల ఇళ్ల ముందు డప్పులు కొట్టమని చెప్పి, ఇతర పార్టీల ఎంఎల్ఏలను స్వయంగా మీరే కండువా కప్పి పార్టీలోకి అహ్వానిస్తున్నారని, ఇప్పుడు ఏ డప్పులు కొట్టాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
90 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి!
అలాగే ఒక పార్టీ ఎంఎల్ఏ మరో పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేయడం చరిత్రలో ఎప్పుడు లేదని, ఆయన మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దానం నాగేందర్ మీద స్పీకర్ కి డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామంటే ఆయన అందుబాటులో ఉండటం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపుకి పాల్పడిన దానంపై 90 రోజుల్లో చర్య తీసుకోవాలని, స్పీకర్ కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒకటి, ఆఫీస్ లో ఒక్కటి, మెయిల్ ద్వారా మరో పిటిషన్ ఇస్తున్నామని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాతే ఎంఎల్ఏలను పార్టీలో చేర్చుకోవాలని, దమ్ముంటే మళ్ళీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. 2/3 మెజారిటీ తో ఎంఎల్ఏలు పార్టీలోకి వచ్చినా, లేదంటే రాజీనామా చేసినా బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. అంతేగాక చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, వారు ఎవరన్నది ముందు ముందు తెలుస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.