టార్గెట్ మాణిక్కం ఠాగూర్.. అసంతృప్తులతో కలిసిపోయిన Revanth Reddy..?

రాష్ట్ర కాంగ్రెస్​నేతలు కొత్త పంథా ఎత్తుకున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తొలిగించాలని

Update: 2022-08-25 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్​నేతలు కొత్త పంథా ఎత్తుకున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తొలిగించాలని మూకుమ్మడిగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని సుదీర్ఘ లేఖను ఏఐసీసీకి అందించారు. ఇప్పటి వరకు రేవంత్​, ఠాగూర్, సునీల్​ ముగ్గురు ఒక్కటేననే ప్రచారం పార్టీలో జరుగుతున్న విషయం తెలిసిందే. రేవంత్‌కు మాణిక్కం ఠాగూర్​ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్‌పై సీనియర్లు ఫిర్యాదు చేయగా.. రేవంత్​ రెడ్డి కూడా సైలెంట్‌గా ఈ ఫిర్యాదుకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఠాగూర్‌ను మార్చే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఆరోపణలు ఇవీ

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా మాణిక్కం ఠాగూర్ వచ్చాక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందని, ఠాగూర్ రాకముందే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగుందని కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకుల్లో అభిప్రాయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ఇన్ ఛార్జిగా ఠాగూర్ నియామకం తర్వాత జరిగిన దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణ పరాజయాలు మూటగట్టుకుందని, 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 26,799 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, అదే 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో ఠాగూర్ అంతా నేనే నడిపిస్తున్నానంటూ హడావుడి చేశారని, తీరా ఫలితం చూస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయి 22,196 ఓట్లతో సరిపెట్టుకుందని, 2018 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 4,603 ఓట్లను కోల్పోయిందని ఏఐసీసీకి వివరించారు. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓట్ల పరంగానూ నష్టపోయిందని, ఠాగూర్ ఒంటెత్తు పోకడలు, కార్యకర్తలను దగ్గరకు తీసే వ్యక్తిత్వం లేకపోవడం వంటి కారణాలతో సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 75,884 ఓట్లు రాగా, 2021 ఉప ఎన్నికల్లో 70,932 ఓట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలిచిందని, 2018 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 4,952 ఓట్లను కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని వెల్లడించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అంత దారుణ ఓటమి ఎన్నడూ రాలేదని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిదేనని, వీరిద్దరూ అహంకారపూరితంగా, పార్టీ నాయకులను, సీనియర్లను లెక్కచేయకుండా, ఒంటెత్తు నిర్ణయాలతో పార్టీని సర్వనాశనం చేశారని, 2018 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ 61,121 ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారని వివరించారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ పరోక్షంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు పలకడం, పార్టీ అభ్యర్థికి సహకరించకపోవడం వంటి కారణాలతో కేవలం 3,014 ఓట్లకే పరిమితమై చరిత్రలో ఎన్నడూ చూడని ఓటమిని, అవమానాన్ని పొందిందని, 2018 ఎన్నికలతో పోలిస్తే 58,107 ఓట్లను నష్టపోయి మూడో స్థానానికి పార్టీ పతనమైందని పేర్కొన్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్లా కాంగ్రెస్ పార్టీ ఐదో స్థానానికి మాత్రమే పరిమితం అయిందని, నల్గొండ గ్రాడ్యుయేట్ ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థులు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారని, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో స్థానంలో నిలిస్తే మూడు, నాలుగు స్థానాల్లో స్వతంత్రులు నిలిచారని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 5,101 ఓట్లు మాత్రమే పోలయ్యాయని వెల్లడించారు. ఇవేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిందని, జీహెచ్ఎంసీలో కేవలం రెండంటే రెండు చోట్లే పార్టీ విజయం సాధించిందని, అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా రెండో స్థానంలో నిలిచేదని, కానీ, ఠాగూర్ వ‌చ్చిన త‌రువాత తీసుకున్న అర్థంప‌ర్థం లేని నిర్ణయాలతో రెండు డివిజన్లలో గెలిచి, మరో రెండు చోట్ల రెండో స్థానంలో పార్టీ నిలిచిందని, 146 స్థాన‌ల్లో పార్టీ అభ్యర్థులు మూడు, నాలుగు స్థానాలు, మ‌రికొన్ని చోట్ల 5వ స్థానంలో నిలిచి డిపాజిట్ సైతం కోల్పోయిందని ఈ సందర్భంగా ఏఐసీసీకి నివేదించారు.

కేవ‌లం సోష‌ల్ మీడియాలో ఫాల్స్ ప‌బ్లిసిటీ చేయిస్తూ, మొద‌ట నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తున్న నాయ‌కులు, కార్యక‌ర్తల‌పై కొంద‌రు చేస్తున్న విష ప్రచారానికి, వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు ప్రత్యక్షంగానూ, ప‌రోక్షంగానూ స‌హ‌క‌రిస్తున్నారని, సంవ‌త్సరాల త‌ర‌బ‌డి కాంగ్రెస్ జెండా మోసిన నాయ‌కులు పార్టీని వీడి పోయేలా చేస్తున్నారని ఠాగూర్, రేవంత్​ పై మండిపడ్డారు. పార్టీకి బ‌లం పెంచేలా కార్యక్రమాలు చేయ‌డం మానేసి గ్రౌండ్ లెవెల్లో పార్టీని విధ్వంసం చేసేలా ప‌క్కా ప్రణాళిక‌తో ఠాగూర్ వ్యవ‌హ‌రిస్తున్నారని, ఇందుకు వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలే సాక్ష్యమని వివరించారు. కాంగ్రెస్‌లో చేరాల్సిన ఈటల రాజేంద‌ర్‌ను బీజేపీలోకి పంపింది రేవంత్ రెడ్డి అయితే.. ప‌రోక్షంగా స‌హ‌క‌రించింది ఠాగూర్ అని విమర్శించారు. మాణిక్కం ఠాగూర్ అహంభావం, కార్యకర్తలను, నాయకులను చులకనగా చూడడం, అంతా నాకే తెలుసన్న అహంకారం, మనీ మేనేజ్డ్ పాలిటిక్స్ చేయడం, సీనియర్ నాయకులంటే చిన్నచూపు, ఒంటెత్తు పోకడలు, వెరసి పార్టీ నాశనం కావడానికి ప్రధాన కారణంగా మారాడని కాంగ్రెస్​ నేతలు ఏఐసీసీకి ఇచ్చిన రిపోర్ట్‌లో వెల్లడించారు.

రేవంత్​సైలెంట్​

ఇటీవల ఏఐసీసీ జనరల్​సెక్రెటరీ ప్రియాంక గాంధీతో జరిగిన సమావేశంలో ఠాగూర్‌పై పార్టీ నేతలు మూకుమ్మడిగా ఈ ఆరోపణలు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ.. సైలెంట్‌గా ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పారు. దీంతో ఠాగూర్​ పై ఫిర్యాదుకు రేవంత్​‌కు పరోక్షంగా సహకరించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మారుస్తారా..?

రాష్ట్రంలో త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉన్నప్పటికీ.. ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారుతాయనేది కొంత కష్టంగా మారింది. అయితే, మునుగోడులో కాంగ్రెస్​పార్టీ గెలువకున్నా, కనీసం రెండో స్థానంలో ఉండకున్నా పార్టీలోకి కీలక నేతలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఠాగూర్‌ను కూడా మారుస్తారని, ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన ఓ మాజీ ఎంపీని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​గా నియమిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News