ఇదేం లెక్క.. ‘సీఎం రిలీఫ్ ఫండ్’ సహాయంలో సర్కారు వివక్ష..?

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే విధానం ఉమ్మడి రాష్ట్రం నుంచే కొనసాగుతున్నది.

Update: 2023-02-25 03:19 GMT

పేదలకు అందే సాయంలోనూ సర్కారు వివక్ష చూపుతున్నది. మూడు నియోజకవర్గాల ప్రజలను ఒకలా.. మిగతా రాష్ట్ర ప్రజలను మరోలా చూస్తున్నది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సహాయమే ఇందుకు ఉదాహరణ. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వస్తున్న అప్లికేషన్లకే ప్రయారిటీ ఇస్తూ.. వారికి హాస్పిటల్స్ బిల్లుల్లో 70 శాతం మంజూరు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మిగతా సెగ్మెంట్ల నుంచి వచ్చే దరఖాస్తులకు బిల్లుల్లో 30 శాతానికే మించి ఇవ్వడం లేదని సమాచారం. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే చాన్స్ ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే విధానం ఉమ్మడి రాష్ట్రం నుంచే కొనసాగుతున్నది. ఎవరైనా ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే.. ఆస్పత్రులకు చెల్లించిన బిల్లులను పూర్తిగా తనిఖీ చేసేవారు. అందులో 70 శాతం వరకు అమౌంట్‌ను పేషెంట్‌కు చెల్లించేవారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బిల్లులో కేవలం 30 శాతం మాత్రమే ఇస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పైరవీ లేకుండానే 70 శాతం పైగా సాంక్షన్ చేసేవారు. స్పెషల్ కేసుల విషయంలో రిక్వెస్ట్ చేస్తే నూరు శాతం చెల్లించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 30 శాతానికి లిమిట్ పెట్టారు.’ అని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ఆ మూడు సెగ్మెంట్లకే ప్రయారిటీ..

సీఎం రిలీఫ్ ఫండ్‌లో మూడు సెగ్మెంట్లను స్పెషల్‌గా చూస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి వచ్చే అప్లికేషన్లకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ సెగ్మెంట్ల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లించిన ఫీజుల్లో 60 నుంచి 70 శాతం పక్కాగా ఇస్తున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చే అప్లికేషన్లకు సాదాసీదాగా 30 శాతానికి పరిమితం చేస్తూ సాంక్షన్ ఇస్తున్నట్టు టాక్ ఉంది.

ఎక్కువ కావాలంటే ప్రగతి భవన్‌కు వెళ్లాల్సిందే

సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చే దరఖాస్తులు మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు కూడా తక్కువ మొత్తంలో సాంక్షన్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేస్తారనే భయం వారికి పట్టుకున్నది. అందుకని అప్లికేషన్లు తీసుకుని ప్రగతిభవన్‌కు వెళ్తున్నారు. ఎక్కువ మొత్తంలో చెల్లించాలని పైరవీలు చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తల కోసం కూడా పైరవీ చేయాల్సిన దుస్థితి నెలకొందని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయడానికి వచ్చే ఇబ్బందులేమిటో తెలియవని సదరు మంత్రి కామెంట్ చేశారు.

గులాబీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి

సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులోనూ వివక్ష చూపుతుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేతీరుగా చూడాలని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం మూడు నియోజకవర్గాల్లో గెలిస్తేనే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ సెగ్మెంట్ల నుంచి వచ్చే అప్లికేషన్లకు ఎక్కువ ప్రయారిటీ ఎందుకిస్తున్నారని అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కొందరికి ఎక్కువ మొత్తంలో, మిగతా వారికి తక్కువ మొత్తంలో రిలీజ్ చేయడం సరికాదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News