బీఆర్ఎస్‌కు దిమ్మతిరగాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తుక్కుగూడ సభలో కనిపించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తుక్కుగూడ సభలో కనిపించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పార్టీ కార్యకర్తలంతా ఈ నెల 17 ఇంటి గడప దాటి బయటకు రావాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సిన సమయం ఇదని, కార్యకర్తలంతా నూతనోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు దిమ్మ తిరిగేలా తుక్కుగూడ సభ సౌండ్ కేసీఆర్‌కు వినిపించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో మొదటి సారి అధికారికంగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయని, కార్యకర్తలంతా సక్సెస్ చేయాలన్నారు. భారీ బహిరంగ సభపై దేశ నాయకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుందన్నారు. నిజాం పరిపాలనతో కూడిన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత దేశంలో కలిపిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. ఈ సెంటిమెంట్‌తోనే ఐదు గ్యారంటీలను సోనియా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు మల్లిఖార్జున ఖర్గే, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద ఉండే అరుదైన సభకు అందరూ హాజరు కావాలని సూచించారు. ఇక నల్గొండ పార్లమెంట్‌లో దేశంలోనే అత్యధిక సభ్యత్వం నమోదు చేయడం సంతోషకరమని చెప్పారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు. తాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ రాజకీయ అనుభవంతో 70 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ఖచ్చితంగా చెబుతున్నానని వెల్లడించారు.
ఏఐసీసీ ఇంచార్జీ థాక్రే.. మాట్లాడుతూ...కేసీఆర్ పాలనకు చివరి రోజులు వచ్చాయన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఇక సీడబ్ల్యూసీ మీటింగ్‌కు వివిధ రాష్ట్రాల నుంచి కీలకమైన కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు ఈ మీటింగ్‌ను నిర్వహించి ఎన్నికలపై ఓ ప్రణాళికను తీసుకుంటామన్నారు. 17 సాయంత్రం తుక్కుగూడ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పార్టీ ప్రత్యేకమైన లక్ష్యాన్ని పెట్టుకున్నదన్నారు. పార్టీ తనదైన శైలీలో వ్యూహాలను సిద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఇంచార్జీ పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.