బీఆర్ఎస్‌లో మొదలైన లుకలుకలు.. జిల్లా కోఆర్డినేటర్ రాజీనామా

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. ఒడిశా ఇన్‌చార్జి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ఇటీవలే రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

Update: 2024-02-19 02:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. ఒడిశా ఇన్‌చార్జి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ఇటీవలే రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు కూడా తప్పుకున్నారు. ఆ రాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌చార్జిగా ఉన్న తోట చంద్రశేఖర్ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి కొనసాగింపుగా మహారాష్ట్రలో బీడ్ జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న దిలీప్ గ్యానోబా గోరె బాధ్యతలతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు మహారాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న వంశీరావ్, మహారాష్ట్రలోని పార్టీ నాయకులనూ కలిసే అవకాశం లేకుండా పోయిందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

నాయకత్వ లోపమున్న పార్టీలో ఇక ఎంతమాత్రం కొనసాగలేనని స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్ 20న శంభాజీనగర్‌లో జరిగిన భారీ ర్యాలీ, బహిరంగసభలో తన శక్తి మేరకు దాదాపు 50 వేల మందిని సమీకరించానని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తుందని భావించానని పేర్కొన్నారు. కానీ కేసీఆర్, మహారాష్ట్ర లీడర్లు కేడర్‌ను డ్రైవ్ చేయడంలో ఫెయిల్ అయ్యారని, దిశానిర్దేశంలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నందున తనతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా గందరగోళంలో ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను, వంశీరావ్‌ను, మహారాష్ట్ర లీడర్లను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తప్పుకోక తప్పడంలేదని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News