Congress : పని చేసే సీఎం.. ఫాంహౌస్ సీఎంకి తేడా ఇది! ‘దిశ’ స్పెషల్ ఆర్టికల్‌పై కాంగ్రెస్ రియాక్షన్
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం అమెరికా టూర్‌పై పెట్టుబడులు, ఉద్యోగాలు.. 5 రోజులు 10 ఎంవోయూలు, ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి చాన్స్ అంటూ దిశ పత్రికలో ఎడిషన్ ప్రచూరితమైంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించింది. ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర యువత కొలువుల కోసం, తన రాష్ట్ర భవిత బాగుకోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అంతర్జాతీయ దిగ్గజ పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఒప్పిస్తూ మెప్పిస్తూ తన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ తపన పడిన దృశ్యం ఎన్నడైనా చూశామా? పని చేసే ముఖ్యమంత్రికి, ఫాంహౌస్ ముఖ్యమంత్రికి తేడా ఇది’ అంటూ దిశ పేపర్ వార్తను జోడించి పోస్ట్ చేసింది.
మరోవైపు ముఖ్యమంత్రి పీఆర్వో బొల్గం శ్రీనివాస్ సైతం ఈ స్పెషల్ ఆర్టికల్‌పై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 9 వరకు కుదిరిన ఒప్పందాలు పేర్కొన్నారు. కాగ్నిజెంట్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్ లో అతిపెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు. వాల్ష్ కార్రా హోల్డింగ్స్ కంపెనీ వీ-హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడి. ఆర్సీసిఎం సంస్థ నుంచి దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు. స్వచ్ఛ్ బయో అనే కంపీని నుంచి రూ.1000 కోట్ల పెట్టుబడులు.
500 మందికి ఉద్యోగాలు. ట్రైజిన్ టెక్నాలజీస్ జరిగిన ఒప్పందంతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.హెచ్‌సీఏ హెల్త్ కేర్ నుంచి తెలంగాణలో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ. కార్నింగ్ గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం. వరల్డ్ బ్యాంక్ నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం. వివింట్ ఫార్మా నుంచి రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు 1000 మందికి ఉద్యోగాలు.చార్లెస్ స్క్వాబ్ సంస్థతో భేటీలో హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్. ఆమ్జెన్ కంపెనీ నుంచి హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. 3000 మందికి ఉద్యోగాలు.. అంటూ వివరించారు.