సీసీఎల్ఏ ఎదుట వీఆర్ఏల ధర్నా.. రెవెన్యూలో కొనసాగించాలని డిమాండ్

వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు.

Update: 2024-06-24 12:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించి బీఆర్ఎస్ హామీని నిలబెట్టుకోలేదని, చనిపోయిన, రిటైరైనా వారి వారసులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో పని చేస్తోన్న వారికి ఆప్షన్లు ఇచ్చిన తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకురావాలన్నారు. దూర ప్రాంతాలకు బదిలీ చేసిన వారిని స్వస్థలాలకు బదిలీ చేయాలన్నారు.

ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ కో కన్వీనర్ వంగూరు రాములు మాట్లాడుతూ.. వీఆర్ఏల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అధికారులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 2020 సెప్టెంబరు 9న అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. 80 రోజుల సుదీర్ఘ సమ్మె తర్వాత పదోన్నతులు దక్కాయన్నారు. వృద్ధుల స్థానంలో, రిటైరైన వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు గైడ్ లైన్స్ జారీ చేయలేదన్నారు. మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖలకు వెళ్లిన వీఆర్ఏలతో చెత్త క్లీన్ చేయించడం, మురికి కాల్వలు తీయించడం, రోడ్లు ఊడ్పించడం వంటి పారిశుధ్య పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి ఆప్షన్లు ఇచ్చి రెవెన్యూకి తీసుకోవాలన్నారు. ఆ తర్వాత సీఎమ్మార్వో వి.లచ్చిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. లచ్చిరెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వం వీఆర్‌‌ఏల పట్ల సానుకూలంగా ఉందని, రెవెన్యూ మంత్రితో చర్చి సమస్యలు త్వరలో పరిష్కారమయ్యేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో వీఆర్ఏల సంఘం నాయకులు ఎం.కరుణాకర్, భూషయ్య, నల్లగిరిరావు, ఎన్.నర్సింహ, తిరుపతి, మైసూర్, మల్లేశ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News