రిజెక్టా.. పరిష్కారమా? ‘ధరణి’ బాధితులకు లభించని సొల్యూషన్

ధరణి పెండింగ్ దరఖాస్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Update: 2024-06-19 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పెండింగ్ దరఖాస్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో పది రోజుల్లోనే అన్నింటినీ క్లియర్ చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆఫీసర్లకు సూచనలిచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇప్పుడు డ్యాష్ బోర్డ్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. సెలవు రోజుల్లోనూ తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయాల్లో కూర్చొని పని చేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను ‘రిజెక్ట్’ చేస్తూ వాటి సంఖ్య తగ్గిస్తున్నారు. జిల్లాల వారీగా రిపోర్టులు సమర్పించాక.. సమస్యలన్నీ పరిష్కారమైనట్టు ప్రభుత్వం భావించే అవకాశముంది.

అకారణంగా రిజెక్ట్..

సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ లో అప్లయ్ చేసుకొని వేలాది మంది ఏడాది, రెండేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారు. కనీసం జత చేసిన పత్రాలను కూడా చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా ధరణి పోర్టల్ లో ఆర్డీఓ లేదా తహశీల్దార్ దగ్గర అప్లికేషన్ పెండింగ్ అని చూపించేది. ఇప్పుడు మీ ప్రాపర్టీ నిషేదిత జాబితాలో ఉందని, టీఎం 15 లేదా టీఎం 33 కింద అప్లయ్ చేసుకోవాలంటూ ట్రాన్సాక్షన్ స్టేటస్ లో చూపిస్తున్నది. దీంతో ఇప్పుడు మరోసారి అప్లయ్ చేసువాల్సి ఉంటుంది. అలా చేస్తే కొత్త ఫైల్ గా ముద్ర పడుతుంది. మళ్లీ వ్యవహారం మొదటికే వస్తుంది. భూ సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రులు ఆదేశిస్తున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

రిజెక్ట్.. హేళన

తన ఖాతా నుంచి ఎకరం భూమిని అక్రమంగా వేరే వారికి చేశారని, సరిచేయాలని నల్లగొండ జిల్లాలో ఓ రైతు అర్జీ పెట్టుకున్నాడు. తాను ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయలేదని, ఆఖరికి సాదాబైనామా కింద కూడా అమ్మలేదని మొరపెట్టుకున్నాడు. ఆయన వారసులు ఆర్టీఐ కింద సమాచారం అడిగితే రెవెన్యూ సిబ్బంది పొరపాటేనని రాసిచ్చారు. అయినా మూడేండ్లుగా అప్లయ్ చేయడం, రిజెక్ట్ చేయడం ఇలా సమస్యను పరిష్కరించకుండా తిప్పించుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి రిజెక్ట్ చేశారు. దీంతో దరఖాస్తు తిరస్కరణకు కారణాలేమిటని అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండా వెకిలిగా నవ్వారని సదరు రైతు వాపోయాడు.

‘అవును.. డ్యాష్ బోర్డు క్లియర్ చేయడంలో భాగంగా రిజెక్ట్ చేశాం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే తన ఖాతాలో అయాచితంగా ఎకరం భూమి చేరిందని తెలిసిన వ్యక్తి డిజిటల్ సంతకం కోసం ఐదు రోజుల క్రితం అప్లయ్ చేశాడు. దీంతో ఆ భూమిని రాసిచ్చేందుకు నోటీసులు జారీ చేసినట్లు ధరణి పోర్టల్ లో చూపిస్తున్నది. మూడేండ్లుగా న్యాయం కోసం తిరుగుతున్న రైతును పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. కానీ పొరపాటు వల్ల ఖాతాలో చేరిన ఎకరం భూమిని దక్కించుకునేందుకు వ్యక్తి కుట్ర చేస్తుంటే అధికారులు సపోర్ట్ చేయడం గమనార్హం.

క్లియర్ చేసేందుకు అత్యుత్సాహం

ప్రస్తుతం డ్యాష్ బోర్డ్ క్లియర్ చేస్తున్న వాటిలో ఏ కారణం లేకుండా తిరస్కరిస్తున్న ఫైళ్లే అత్యధికం. కనీసం ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియని పరిస్థితి ఉంది. గతంలో అప్లికేషన్ తిరస్కరణకు గురైనట్టు కారణాలు తెలుపుతూ దరఖాస్తుదారుడికి మెస్సేజ్ వచ్చేది. ఇప్పుడు అది కూడా రావడం లేదు. మిస్సింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే అడిగితే తిరిగి అప్ లోడ్ చేయొచ్చు. కానీ డ్యాష్ బోర్డు క్లియర్ చేసేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఓ తహశీల్దార్ బాధ్యతలు స్వీకరించగానే అప్పటి దాకా పెండింగులో ఉంచిన ఫైళ్లన్నీ గంపగుత్తగా రిజెక్ట్ చేశారు. ఏకంగా 500 దరఖాస్తులను తిరస్కరించారు. వాటన్నింటినీ రెండు రోజుల్లోనే పరిశీలించినట్లు రికార్డులో రాసుకున్నారు. నిజానికి ఏ కారణం చెప్పకుండా రిజెక్ట్ చేసి ఆ కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురి చేశారు. అడిగితే ఇక్కడ భూముల ధరలు అధికం. ఏ చిన్న పొరపాటు జరగొద్దనే అలా చేశాం. మళ్లీ అప్లయ్ చేసుకోవాలని చెప్పినం. అంతే తప్ప అందులో ఏ దురుద్దేశ్యాలు లేవని సమర్థించుకున్నారు. దీంతో మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.

గోప్యంగానే వివరాలు

ధరణి పోర్టల్ ద్వారా వివిధ సమస్యలపై ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి? ఎన్నింటిని పరిష్కరించారు? ఎన్నింటిని తిరస్కరించారు? ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి? ఈ అంశాలను సీసీఎల్ఏ గోప్యంగా ఉంచుతున్నది. సమాచార హక్కు చట్టం కింద అడిగినా వివరాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందిన దరఖాస్తుల వివరాలను చెప్పడం చట్టవిరుద్ధమంటూ రిప్లయ్ ఇస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకుంటే అది ప్రభుత్వ భూమి కాదు.. పట్టా అని మీరే రుజువులు సమర్పించాలంటూ రెవెన్యూ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తరతరాలుగా అనుభవిస్తున్నామని, కొనుగోలు చేసినట్లుగా సేల్ డీడ్స్ ఉన్నాయని చెప్పినా వినిపించుకోవడం లేదు. తహశీల్దార్, కలెక్టర్లను ఒప్పిచినా... చాలాసార్లు ఫైల్ రిజెక్ట్.. రీ కన్ఫర్మేషన్ అంటూ పంపిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ మళ్లీ తీసుకురావాలి

-ఓ వీఆర్ఏ

ధరణి తప్పుల తడక, దాన్ని మార్చేయాలని చెబుతూనే.. పది రోజుల్లో దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. నెల రోజుల్లో లక్షల దరఖాస్తులు పరిష్కరించే వ్యవస్థ ఉంటే ధరణి బాగున్నట్టే కదా! మా కేశంపేట మండలంలో44 మంది వీఆర్ఏలు, పది మంది వీఆర్వోలు ఉండేవారు. 54 మందిని తీసేసి ఆరుగురిని మాత్రమే ఉంచితే.. క్షేత్ర స్థాయి విచారణ ఎలా ముందుకు సాగుతుంది. ఇలా డెడ్ లైన్లు ఇచ్చి పూర్తి చేయాలంటే అన్ని రిజెక్ట్ చేసి డ్యాష్ బోర్డు క్లియర్ చేస్తారే తప్ప రైతుల సమస్యలకు పరిష్కారం లభించదు. స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు టీఎం 33లో కాకుండా తెల్ల కాగితాల మీద సమస్య రాసిచ్చినా తీసుకోండని చెప్పారు. మరి వాటి సంగతి ఏంటి? మునుపటి లాగా అధికారాలు తహశీల్దార్లకు ఇవ్వాలి. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ తెచ్చి మళ్లీ ఎల్ఆర్ యూపీ వంటి ప్రోగ్రాం తెస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.


Similar News