ధరణి కుట్రపూరిత చర్యే

గత ప్రభుత్వం కుట్రపూరితంగానే ధరణి పోర్టల్ ని తీసుకొచ్చింది. చాలా సంవత్సరాలుగా భూమిపై సర్వ హక్కులు ఉండి, అనుభవిస్తోన్న కొందరు రైతులకు వారి భూమి వారికి కాకుండా చేసిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

Update: 2024-07-25 12:17 GMT

ధరణి కుట్రపూరిత చర్యే

– కమిటీ నివేదిక అందగానే చర్యలు

– 1.73 లక్షల దరఖాస్తుల పరిష్కారం

– అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిశ, తెలంగాణ బ్యూరో:

గత ప్రభుత్వం కుట్రపూరితంగానే ధరణి పోర్టల్ ని తీసుకొచ్చింది. చాలా సంవత్సరాలుగా భూమిపై సర్వ హక్కులు ఉండి, అనుభవిస్తోన్న కొందరు రైతులకు వారి భూమి వారికి కాకుండా చేసిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూములను ధరణి పోర్టల్ లో నమోదు చేసే సమయంలో చోటు చేసుకున్న లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు మనోవేదనకు గురయ్యారు. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది వారి భూములను అమ్ముకోలేకపోయారన్నారు. పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి నానా అగచాట్లు పడ్డారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలా మంది రైతులు రైతుబంధు, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. ఇదే విషయాన్ని హైకోర్టు ధరణి పోర్టల్ లోని ఎన్నోలోపాలను ఎత్తి చూపించిందన్నారు.

కమిటీ నివేదిక ప్రకారమే

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం జనవరిలోనే ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ ని చేపట్టినట్లు భట్టి వివరించారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగులో ఉండగా 1,22,774 కొత్త దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 3,49,514 దరఖాస్తుల్లో 1,79,143 దరఖాస్తులను పరిష్కరించినట్లు చెప్పారు. ధరణి పోర్టల్ లో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూళ్లను 10 సమాచార మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంత పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారాల పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తుందని, ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 


Similar News