ఇంటర్ పరీక్షల్లో చెడ్డీ వీరులు.. చిట్టీలు ఎక్కడెక్కడ దాచారో తెలుసా?
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తుది పరీక్షల్లో చోటుచేసుకునే వింతలు అన్ని ఇన్ని కావు.
దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తుది పరీక్షల్లో చోటుచేసుకునే వింతలు అన్ని ఇన్ని కావు. బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు మార్కులు, ర్యాంకుల కోసం పోటీ పడుతుండగా.. మరికొంత మంది పాస్ అయితే చాలు అని దేవుడిపై భారం వేస్తారు. వీరిలా కాకుండా మరో క్రియేటివ్ బ్యా్చ్ ఉంటుంది. వారే చిట్టీల వీరులు. ఏమాత్రం ప్రిపేర్ కాకుండా కేవలం చిట్టీలమీదే ఆధారపడి ఎగ్జామ్ సెంటర్‌కు వస్తారు. అందులో కొందరు ఎలాగోలా గట్టేక్కి బయటపడుతుండగా.. మరికొందరు అధికారులకు దొరికిపోయి చిక్కుల్లో పడుతుంటారు.
సరిగ్గా ఇదే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గురువారంతో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో చిట్టీలు కొట్టి దొరికిపోయిన విద్యార్థుల వివరాలు అధికారులు వెల్లడించారు. మొత్తం 10 రోజుల్లో 142 విద్యార్థులు చీటింగ్ చేస్తూ పట్టుబడ్డారని వెల్లడించారు. అందులో చాలా మంది డ్రాయర్లు, దుస్తుల్లో, బూట్లలో చిట్టీలు దాచుకుని వచ్చారని తెలిపారు. వీరితో పాటు మాల్ ప్రాక్టీస్‌కు అనుమతించిన 9 మంది ఇన్విజిలేషన్ సిబ్బందిని, అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.