తెలంగాణలో ప్రస్తుత డీఎస్సీ యధాతథం
ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు...
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వాయిదా వేస్తే రిక్రూట్ మెంట్ కు ఆలస్యం జరుగుతుందన్నారు. లీగల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. త్వరలో మరో డీఎస్సీని నిర్వహిస్తామని, కొత్తగా ఐదారు వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాగా ప్రిపేర్ అవ్వాలని, ఉద్యోగం సాధించాలని కోరుకున్నారు. జాబ్ క్యాలెండర్‌ను వేగవంతం చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహించే డీఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేనందున పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే నోటిఫికేషన్ వేగవంతం చేశామన్నారు. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిందన్నారు.
గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో గ్రూప్ వన్, గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం రాగానే మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందన్నారు. ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, 1,75,527 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, తమ ప్రభుత్వం రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేసి ఐదు వేలకు మరో ఆరు వేలు కలిపి 11 వేల మందికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దాదాపు 2.79 లక్షల మంది అప్లై చేసుకోగా, ఇప్పటికే రెండు లక్షల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.