సమ్మర్‌లో కరెంటు కష్టాలు రాకూడదు: డిప్యూటీ సీఎం
రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్లాన్ చేసుకోవాలని ఆ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్లాన్ చేసుకోవాలని ఆ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ ఉండాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థ సామర్థ్యం తదితరాలన్నింటిపై స్పష్టమైన ప్రణాళికను రెడీ చేయాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కావాల్సి ఉన్నదని, అందులో ఫస్ట్ ఫేజ్‌గా 1600 మెగావాట్లతో నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, త్వరలో దాని కమిషనింగ్‌పై ఫోకస్ పెట్టాలన్నారు.
మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను సెకండ్ ఫేజ్‌లో స్పీడప్ చేసేలా ఎన్టీపీసీతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గురువారం సాయంత్రం జరిగిన రివ్యూ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ అవసరాలు, యాక్షన్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చ జరిగింది. పకడ్బందీ ప్రణాళికతో సమిష్టి కార్యాచరణ ఉండాలని జెన్‌కో, ట్రాన్స్ కో, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి రాష్ట్ర విద్యుత్ అవసరాలు పెరగనున్నాయని, దానికి తగినట్లుగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా తదితరాలకు స్పష్టమైన సన్నాహక చర్యలు ఉండాలని నొక్కిచెప్పారు. వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవసరాలు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అదికారులు ఏవైనా ప్రత్యామ్నాయాలను, కొత్త ప్రతిపాదనలను సూచిస్తే వాటిని అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకోడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. సింగరేణి బొగ్గు గనుల ఆధ్వర్యంలో జైపూర్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం నివేదిక తయారుచేసి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. వేసవిలో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందస్తుగానే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.