Delhi Liquor Scam: కవిత కేసులో చార్జిషీట్ పై విచారణ మరోసారి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాఖలైన చార్జిషీట్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.

Update: 2024-08-09 07:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాఖలైన చార్జిషీట్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈ నెల 21 కి వాయిదా వేస్తూ.. రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురును నిందితులుగా పేర్కొంటు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు.

అంతేగాక చార్జిషీట్ లోని పేపర్లకు ఒకవైపు మాత్రమే పేజ్ నంబర్ ఉందని, వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై సీబీఐ ఈ నెల 14 వరకు పేజీనేషన్ సరి చేసి ఇస్తామని, అప్పటివరకు సమయం ఇవ్వాలని కోర్టుకు వాదనలు వినిపించింది. దీంతో చార్జిషీట్ పై తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కావేరి భవేజా తెలిపారు. ఈ మేరకు విచారణను ఆగస్టు 21 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రధాన నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సీబీఐ, ఈడీ కేసులలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Tags:    

Similar News