‘బినామీ’ ఉపసంహరణ పిటిషన్‌పై ఉత్కంఠ.. పిళ్ళయ్ ఎలాంటి కారణాలు చూపిస్తారు?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూపులోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున తాను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ గతంలో పలు స్టేట్‌మెంట్ల
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూపులోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున తాను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ గతంలో పలు స్టేట్‌మెంట్లలో చెప్పినప్పటికీ తాజాగా స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నది. పిళ్లయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ఈడీకి ఈనెల 13 వరకు స్పెషల్ కోర్టు డెడ్‌లైన్ విధించింది. పిళ్లయ్ తన పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవడంపై ఈడీ ఎలా స్పందిస్తుందనేది సోమవారం జరిగే విచారణ సందర్భంగా తేలనున్నది. అంగీకరిస్తుందా?.. లేక నిరాకరిస్తుందా?.. లేక అందుకు దారితీసిన కారణాలను వెల్లడించాలంటూ పిళ్లయ్‌కు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయిస్తుందా?.. ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి.
సౌత్ గ్రూపులో కవితకు పిళ్ళయ్ ‘బినామీ’గా వ్యవహరించారంటూ ఈడీ ఇటీవల కోర్టుకు సమర్పించిన పిళ్లయ్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ‘బినామీ’ అర్థం వచ్చేలా పిళ్లయ్ చేసిన కామెంట్లను ఈడీ కూడా సీరియస్‌గా తీసుకున్నది. వీటి ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఆ ప్రకారం మార్చి 11న విచారణకు హజరుకావడానికి ముందురోజు పిళ్లయ్ ఈ పిటిషన్ దాఖలు చేయడం చర్చకు దారితీసింది. పిళ్లయ్‌పై కొన్ని వర్గాల నుంచి వత్తిడి వచ్చినందునే ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఈడీ ఇచ్చే స్పందన కీలకంగా మారనున్నది. రిప్లైలో ఈడీ ఇచ్చే సమాధానానికి, కోర్టులో జరిగే వాదనలకు అనుగుణంగా తదుపరి ఏం జరగనున్నదీ క్లారిటీ అవుతుంది.
ఉపసంహరణకు తగిన గ్రౌండ్ అవసరం
ఈడీ అధికారుల ముందు నిందితులు లేదా ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్ (వాంగ్మూలం) దర్యాప్తులో కీలకంగా ఉంటుందని, దాన్ని ఆధారపడ తగిన ఎవిడెన్సుగా తీసుకుంటారని ఆ వ్యవహారాలతో సంబంధం ఉన్న న్యాయవాది ఒకరు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వాపస్ తీసుకునే వెసులుబాటు ఆ వ్యక్తులకు ఉన్నప్పటికీ ఎందుకు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందో తగిన కారణాలను వెల్లడించాల్సి ఉంటుందని ఆ న్యాయవాది పేర్కొన్నారు. తొలుత అలాంటి స్టేట్‌మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.. అందుకు దారితీసిన పరిస్థితులు.. మానసిక పరిస్థితి తదితరాలన్నింటినీ కోర్టుతో పాటు ఈడీకి వాదనల సందర్భంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నందున కొత్త స్టేట్‌మెంట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సదరు వ్యక్తి కోరినా దానికి తగిన గ్రౌండ్ ఉండదన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఈడీ జరుపుతున్న దర్యాప్తు పురోగతిని, తీరును పరిశీలిస్తే పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్ళయ్ చేసిన విజ్ఞప్తి, దాఖలు చేసిన పిటిషన్ సందర్భోచితంగా ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్దిష్టంగా పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవడంపై అటు ఈడీ తరఫు న్యాయవాది లేవనెత్తే అంశాలు, క్రాజ్ ఎగ్జామినేషన్ తదితరాలన్నీ కోర్టు తీసుకునే నిర్ణయాలకు దోహపడతాయన్నారు. కోర్టు సైతం పిళ్లయ్ ఇచ్చే వాదనలతో సంతృప్తి చెందాల్సి ఉంటుందన్నారు. కేవలం పాత స్టేట్‌మెంట్‌ను వాపస్ తీసుకుంటున్నట్లు కోర్టుకు పిటిషన్ ఇస్తేనే సరిపోదని, దానికి సంతృప్తికరమైన వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని, ఫైనల్‌గా నిర్ణయం తీసుకునేది కోర్టు అని ఆయన వివరించారు.
ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా
ఈడీకి సుదీర్ఘకాలం పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న నితీష్ రాణా హఠాత్తుగా రాజీనామా చేయడం కూడా ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలో ఆయన రాజీనామాపై చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక టీమ్ మెంబర్‌గా ఉన్నప్పటికీ కీలకమైన బాధ్యతల్లో లేరనే వాదన ఈడీ వర్గాల నుంచి వినిపిస్తున్నది. గతంలో దేశంలోనే సంచలనం సృష్టించిన పలు అవినీతి కేసుల దర్యాప్తులో కీలక భూమిక పోషించినా లిక్కర్ స్కామ్‌లో మాత్రం ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు లేవని సమాచారం.
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కర్నాటక కాంగ్రెస్ నేత శివకుమార్, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా తదితరులకు సంబంధించిన అవినీతి కేసుల్లో ఈడీ తరఫున వాదించారు. ఇవన్నీ విపక్ష పార్టీలకు సంబంధించిన కేసులే. ఈడీలో పీపీగా 2015లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ తదితరుల కేసుల్లోనూ విదేశాల్లో భారత్ తరఫున వాదించారు. కృషికి గుర్తింపుగా ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించారు. ఇప్పుడు హఠాత్తుగా వ్యక్తిగత కారణాలను చూపి రాజీనామా చేయడం కీలకంగా మారింది.
పిళ్లయ్, నితీష్ రాణా పరిణామాల వెనక..
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు జారీచేసిన తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. దాదాపు ఏడేండ్ల పాటు ఈడీకి పీపీగా పనిచేసిన రాణాకు సమర్ధుడైన న్యాయవాది అనే గుర్తింపు ఉన్నది. అనేక సంచలన అవినీతి కేసుల్లో కోర్టులు శిక్షలు విధించే స్థాయిలో ఈడీ తరఫున వాదించారన్న గుర్తింపు కూడా ఉన్నది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో ఆయన వ్య్తక్తిగత కారణాలను చూపి రాజీనామా చేసినా ఎటు నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అరుణ్ పిళ్లయ్ తన పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషన్ దాఖలైన సమయంలో ఈ రాజీనామా చేయడం గమనార్హం.
ఈ రెండు పరిణామాలతో పాటు కవితను ఈడీ విచారించడానికి ఏమైనా సంబంధం ఉన్నదా అనే స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఇకపైన ఈడీ ఎలా స్పందిస్తున్నది కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి : మార్చి 16న రెండోసారి విచారణకు కవిత.. ఆ డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ ఆదేశం!