Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
దిశ, క్రైమ్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి విచారించాలనుకుంటున్నట్లు ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొన్నది. ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఆమెకు సన్నిహితంగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్‌నుఅరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజునే ఆమెను ఎంక్వయిరీ చేసేందుకు ఈడీ నిర్ణయం తీసుకున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మార్చి 10న జంతర్ మంతర్‌లో దీక్షకు డేట్ ఫిక్స్ చేసుకోడానికి ముందురోజే ఆమెను ఈడీ విచారించడానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ తన స్టేట్‌మెంట్‌లో ఎమ్మెల్సీ కవితకు తాను బినామీ అని అంగీకరించినట్లు ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
జంతర్ మంతర్ దీక్ష నిర్వహణకు సంబంధించి బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీకి వెళ్ళేలా షెడ్యూలు ఫిక్స్ అయింది. స్వయంగా దగ్గరుండి గెస్టులను పిలవడం మొదలు సభా నిర్వహణ బాధ్యతలను చూసుకోవాలనుకున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళిన గంటల వ్యవధినే ఈడీ సెంట్రల్ ఆఫీసులో ఎంక్వయిరీకి రావాలని నోటీసులు జారీ కావడం ఆమెకు ఊహించని పరిణామంగా మారింది. లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించిందని, వందలాది కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళాయని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వ్యాపారవేత్త అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఉన్నారని పేర్కొన్నది. కవిత ప్రతినిధిగా పిళ్ళై వ్యవహరించినట్లు స్వయంగా ఆయనే కాక మరికొంతమంది సైతం విచారణ సందర్భంగా రికార్డు స్టేట్‌మెంట్లలో పేర్కొన్నట్లు ఈడీ పేర్కొన్నది.
ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసు జారీ చేయడం గమనార్హం. జంతర్ మంతర్ సభ విషయాన్ని ప్రస్తావించి వాయిదా వేయాలని కోరుతారా లేక విచారణకు హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. కవిత చేసే విజ్ఞప్తికి ఈడీ సానుకూలంగా స్పందిస్తుందా లేక దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలన్న కారణాన్ని చూపి తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనంటూ పట్టుబడుతుందా అనేది మరి కొన్ని గంటల్లో తేలనున్నది.