Delhi liquor scam : బిగ్ ట్విస్ట్.. MLC కవిత భర్తపై ఈడీ ఫోకస్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఊహకు అందని విధంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఊహకు అందని విధంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపు పోషించిన పాత్ర కీలకమని స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఈ గ్రూపును నడిపించినట్లు ఆరోపించింది. ఇందులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవను, శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరి వంతు అవుతుందనే చర్చలు మొదలయ్యాయి. కానీ వివరాలను సేకరించడంపై ఫోకస్ పెట్టిన ఈడీ కవిత భర్త అనిల్‌కు నోటీసు జారీచేసి ప్రశ్నించాలనుకుంటున్నట్లు సమాచారం.
లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ప్రయోజనం పొందేందుకు గతేడాది మే నెలలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో చర్చలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి డబ్బుండి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఆసక్తి ఉన్నవారిపై సమీర్ మహేంద్రు ఆసక్తి చూపారు. అందులో భాగంగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళయ్ ద్వారా ఆరా తీశారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేవారి గురించి వివరాలను తెలుసుకునే సమయంలో కవిత పేరును పిళ్లయ్ ప్రస్తావించారు. ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో 2021 సెప్టెంబరులో డిన్నర్ మీటింగ్ జరిగిన తర్వాత పిళ్లయ్ ద్వారా ఫేస్‌టైమ్‌లో కవితతో సమీర్ మహేంద్రు మాట్లాడారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్స్ ద్వారా భాగస్వామ్యం లభించిందుకు ఆయనకు ఆమె కృతజ్ఞతలు తెలిపినట్లు ఈడీ తన చార్జిషీట్‌లో సమీర్ మహేంద్రు గతేడాది నవంబరు 12న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రస్తావించింది.
ఆ చర్చలకు కొనసాగింపుగా గతేడాది మే నెలలో హైదరాబాద్ వచ్చిన సమీర్ మహేంద్రు కవితతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. అందులో కవితతో పాటు భర్త అనిల్, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆరోజు చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఈ స్కామ్‌లో ఏ మేరకు ఆయనకు భాగస్వామ్యం ఉన్నది తదితర వివరాలను రాబట్టాలని ఈడీ భావిస్తున్నది. కవితను ప్రశ్నించడానికి ముందు అనిల్‌కు నోటీసు జారీ చేసే ఆలోచన ఉన్నట్లు ఢిల్లీలోని ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చినప్పటికీ ఈడీ దర్యాప్తులో మాత్రం ఆయన పేరును ప్రస్తావించలేదు. స్కామ్‌తో పరోక్షంగా సంబంధాలు ఉన్న కిందిస్థాయి వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నది లేదా అరెస్టు చేస్తున్నది. వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నది. ఆ ప్రకారమే అనిల్‌ను సైతం ప్రశ్నించి వివరాలను సేకరించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే పిళ్లై, అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు తదితరుల నుంచి స్టేట్‌మెంట్లను తీసుకున్నది. ఇక కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ నుంచి కూడా ఇలాంటి వివరాలను సేకరించడానికి సన్నద్ధమవుతున్నది. తొలుత అనిల్‌ను విచారించి ఆ తర్వాత తదుపరి దర్యాప్తుపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీపై చర్చల్లో పాల్గొన్నవారిలో 34 మంది ఒకటికంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడారని, తరచూ సిమ్ కార్డులను మార్చారని, డిజిటల్ ఆధారాలు దొరక్కుండా రీసెట్ చేశారని, కొన్ని మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఫోన్ నెంబర్లతో సహా ఈడీ తన రెండు చార్జిషీట్‌లలో ప్రస్తావించింది. కొన్ని ఫోన్ల నుంచి రికవరీ చేసిన డాటాలో కవిత వాడిన నెంబర్లు, ఫోన్‌లలో అనిల్ సంభాషణలు ఉన్నట్లు ఈడీకి అనుమానం కలిగింది. దాన్ని నివృత్తి చేసుకోడానికే ఆయనపై దృష్టి సారించినట్లు తెలిసింది.
అప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన దినేష్ అరోరా (సీబీఐకి అప్రూవర్‌గా మారారు), అర్జున్ పాండే, విజయ్ నాయర్ తదితరులు హైదరాబాద్‌లోని కోహినూర్ హూటల్‌లో అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, పిళ్లై తదితరులతో సమావేశమైనట్లు ఈడీ (దినేష్ అరోరా గతేడాది అక్టోబరు 1న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉటంకిస్తూ) పేర్కొన్నది. అభిషేక్ ద్వారా రూ. 30 కోట్లను సమకూర్చుకుని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా దినేష్ అరోరాకు విజయ్ నాయర్ సూచించారు. చివరకు 2021 జూలై-డిసెంబరు మధ్యకాలంలో హవాలా మార్గంలో రూ. 30 కోట్లు ఢిల్లీకి చేరాయి. అభిషేక్‌కు బంధువైన లూపిన్‌తో టచ్‌లో ఉన్న దినేష్ అరోరా ఈ సంబంధాలను కూడా వాడుకున్నట్లు తేలింది. దానికి కొనసాగింపుగా ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లోనూ కవిత, విజయ్ నాయర్, పిళ్లై, దినేష్ అరోరా తదితరులు పాల్గొన్నట్లు ఈడీ పేర్కొన్నది. దినేష్ అరోరా అక్టోబరు 3న, పిళ్లయ్ నవంబరు 11న ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఉదహరించింది. ఒబెరాయ్ హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని కూడా ఈడీ సేకరించింది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఈడీ సౌత్ గ్రూపులో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసింది. శరత్‌చంద్రారెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ను తీసుకున్నది. ప్రస్తుతం మాగుంట రాఘవను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నది. ఇది పూర్తయిన తర్వాత తదుపరి దర్యాప్తులో భాగంగా కవిత భర్తను కూడా ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్లు ఈడీ వర్గాల సమాచారం. రాఘవ కస్టడీ మరో వారం రోజుల్లో పూర్తికానున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఈడీ దర్యాప్తు బీఆర్ఎస్‌పై పొలిటికల్ ప్రభావం చూపే అవకాశమున్నది.
ఇవి కూడా చదవండి :
Delhi liquor scam: మాజీ ఎమ్మెల్యే కుమారుడికి 14 రోజుల రిమాండ్
నేరాల నియంత్రణకు 'పీడీ' అస్త్రం.. ఎనిమిదిన్నరేండ్లలో ఎన్ని కేసులో తెలుసా?