ఢిల్లీ: MLC కవితతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
ఢిల్లీకి హుటాహుటినా ఇద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇద్దరు మంత్రులు హస్తినాకు వెళ్లారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శుక్రవారం హుటాహుటినా ఢిల్లీకి బయలుదేరారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇద్దరు మంత్రులు హస్తినాకు వెళ్లారు. తొలుత వెళ్లిన కేటీఆర్ ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఎమ్మెల్సీ కవితతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు తెలిసింది. శనివారం కవితను లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రుల హస్తినా టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే ఎలాంటి తప్పు చేయలేదని విచారణకు సహరిస్తామని కవిత స్పష్టం చేసింది. ఇప్పుడు కవితకు బాసటగా నిలిచేందుకు హస్తినకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. నైతిక మద్దతు ఇవ్వడానికే వెళ్లినట్లు సమాచారం. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. శనివారం లీగల్ సెల్ సభ్యులతో కూడా భేటీ కానున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో ఎలా ముందుకెళ్దాం..? అనేదానిపై బీఆర్ఎస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికే ఢిల్లీ వెళ్లారని విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ కవిత అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంజరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.