త్వరలో కాంగ్రెస్‌లో BRSఎల్పీ విలీనం.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-12 06:34 GMT

దిశ, హిమాయత్ నగర్ : త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని, కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్‌మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేల దొరికినా.. గంటల తరబడి వెయిట్ చేయించేవారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని.. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ విలువ ఉంటుందని, గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని అన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.


Similar News