అమిత్ షా మీటింగ్ ఎఫెక్ట్.. యాక్టివ్ మోడ్‌లోకి రాష్ట్ర నాయకులు!

రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడాలంటే ఇప్పుడున్న స్పీడ్ సరిపోదని జాతీయ నాయకత్వం భావిస్తున్నది. అధికారంలోకి రావాలంటే వేగం పెంచాల్సిందేనని ఆదేశించింది.

Update: 2022-09-24 03:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడాలంటే ఇప్పుడున్న స్పీడ్ సరిపోదని జాతీయ నాయకత్వం భావిస్తున్నది. అధికారంలోకి రావాలంటే వేగం పెంచాల్సిందేనని ఆదేశించింది. స్థానిక నేతలు ఖాళీగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లో ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. అంతేకాకుండా చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంబంధించి డెయిలీ రిపోర్ట్స్ కూడా పంపించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క మునుగోడు నియోజకవర్గానికే దీన్ని పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన అప్ డేట్స్ తమకు ఎప్పటికప్పుడు పంపించాల్సిందేనని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశించినట్లు సమాచారం.

లోకల్ ప్రోగ్రామ్స్ పై స్పెషల్ ఫోకస్

అయితే, పాగా వేయాలని చూస్తున్న బీజేపీ లోకల్ ప్రోగ్రామ్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా మునుగోడులో కచ్చితంగా గెలిచి తీరాలని డిసైడ్ అయింది. అక్కడ ఏం జరుగుతున్నది? ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అనే అంశాలపై బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సమగ్ర నివేదికను కోరుతున్నట్లు తెలిసింది. ఈ డెయిలీ రిపోర్ట్స్ ఆధారంగా బైపోల్ లో వ్యూహరచన చేపట్టాలని అగ్ర నాయకత్వం భావిస్తున్నది. హైకమాండ్ ఆదేశాలతో రాష్ట్ర నేతలు మొత్తం యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇప్పటికే తెలంగాణలో జాతీయ నేతల వరుస పర్యటనలు కొనసాగుతున్నాయి. రకరకాల కార్యక్రమాల పేరిట కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాలను దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా మోర్చాల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ కార్యకలాపాలను స్పీడప్ చేస్తున్నారు.

ఒకే చోట ఉండకుండా..

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే నేతలు ఈ ఒక్క యాత్రకే పరిమితం కాకుండా, జిల్లాల వారీగా సైతం కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. నేతలంతా ఒక్క పాదయాత్ర వద్దే ఉంటే ఇతర కార్యక్రమాల సంగతేంటని ఇటీవల అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆ ఎఫెక్ట్ కారణంగానే నేతలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైనట్లు సమాచారం. నెలలో కనీసం 20 రోజులకు ఏమాత్రం తగ్గకుండా పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రతో పాటు పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, సేవా పక్షోత్సవాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పబ్లిక్ ఫీడ్ బ్యాక్ సైతం..

రాష్ట్రంలో రోజూవారిగా చేపట్టిన కార్యక్రమాలేంటి? ఎన్ని చోట్ల నిర్వహించారు? ముఖ్య నేతలు ఎందరు పాల్గొన్నారు? నాయకులు ఎంతమంది హాజరయ్యారు? అనే అంశాలతో పాటు వాటికి సంబంధించిన ఫొటోలను కూడా పంపించాలని అధిష్టానం రాష్ట్ర నేతలకు ఆదేశించినట్లు తెలిసింది. రోజువారీగా జరిగే కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు తీసుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారనే ఫీడ్ బ్యాక్ ను కూడా అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. స్థానిక లీడర్ల నుంచి మొదలు రాష్ట్రస్థాయి లీడర్ల వరకు ఎవరినీ ఖాళీగా ఉండనివ్వకుండా నిత్యం ప్రజల్లో ఉండేలాగా హైకమాండ్ కార్యక్రమాలు చేపడుతున్నది. అటు జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర పార్టీ నిర్వహించే కార్యక్రమాలతో క్షణం కూడా తీరికలేకుండా శ్రేణులు తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు.బిజీ షెడ్యూల్ తో ఊపిరిసలపకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Tags:    

Similar News